
అధికారుల హత్య కేసు విచారణ వాయిదా
తిరుపతిలీగల్: రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఫారెస్టు అధికారుల హత్య కేసు విచారణను తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి బి.రవీంద్రబాబు శని వారం వాయిదా వేశారు. 2013 డిసెంబర్ 15వ తేదీ ఎర్రచందనం దుంగల అక్రమరవాణాను అడ్డుకోబోయిన తిరుమల డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్‌ఆర్ శ్రీధర్, తిమ్మినాయుడుపాళ్యం బీట్, అసిస్టెంట్‌బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్ కరుణాకర్ మామండూరు రిజర్వు ఫారెస్టులో హత్యకు గురయ్యారు. మరో ఫారెస్టు అధికారిపై ఎర్రకూలీలు హత్యాయత్నంకు పాల్పడ్డారు. దీనిపై ఎస్వీ నేషనల్ పార్కు ఎఫ్‌ఆర్‌వో రామలానాయక్ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 430 మంది ఎర్రకూలీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 351 మందిని పోలీసులు అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు కేసు దర్యాప్తు దశలో మృతిచెందారు. ఇద్దరు మైనర్లు కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వారిపై జువైనల్ కోర్టులో కేసు విచారణ జరగాల్సి ఉంది. తమిళనాడుతోపాటు రాష్ట్రానికి చెందిన 351 మంది ఎర్రకూలీలను ఇదివరలో నెల్లూరు, కడప, రాజమండ్రి, చిత్తూరు, తిరుపతి జైళ్లలో పోలీసులు ఉంచారు. శనివారం కేసు వాయిదా ఉండడంతో పోలీసులు తిరుపతి జైలులో 188 మందిని, పీలేరు జైలులో 90 మందిని, శ్రీకాళహస్తి జైలులో 60 మందిని ఉంచి కోర్టులో హాజరుపరిచారు. మిగతా ఇద్దరిపై పీడీయాక్టు కింద కేసు నమోదు కావడంతో ఇద్దరినీ ప్రత్యేకంగా రాజమండ్రి జైలునుంచి పోలీసులు తీసుకువచ్చారు. 11 మందికి రాష్ట్ర హైకోర్టు వివిధ కారణాలతో ఇదివరలో బెయిల్ మంజూరు చేసింది. శనివారం 11 మంది కూడా కోర్టుకు హాజరయ్యారు.
పిటిషన్‌దాఖలు చేసిన ఏపీపీ
కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారు అధిక సంఖ్యలో నిందితులుగా ఉన్నారు. వారి సమక్షంలో కేసు విచారణ జరగాల్సి ఉన్నందున కోర్టు భవనం విచారణకు సరిపోవడం లేదు. కాబట్టి వేరే ప్రదేశంలో కేసు విచారణ చేపట్టాలని కోర్టును కోరుతూ జిల్లా డెప్యూటీ డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్, ఆ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీసీ రాజేంద్రకుమార్ శనివారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఏపీపీ, నిందితుల తరపున్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి న్యాయమూర్తి ఈ నెల ఐదో తేదీకి వాయిదా వేశారు. కేసులో 64 మంది సాక్షులు ఉన్నారు.
ట్రాన్స్‌లేటర్ నియామకం
కేసులో అధిక సంఖ్యలో తమిళనాడుకు చెందినవారు నిందితులుగా ఉండడంతో కేసువిచారణ తదితర విషయాలు కోర్టుకు సహకరించడానికి ఎస్వీయూనివర్సిటీ తమిళవిభాగం ప్రొఫెసర్ జె.మేన్యూల్‌ను ట్రాన్స్‌లేటర్‌గా న్యాయమూర్తి నియమించారు. కేసు విచారణలో అన్నివిధాల కోర్టుకు సహకరించాలని న్యాయమూర్తి ప్రొఫెసర్‌కు సూచించారు. మొత్తం కేసు విచారణను న్యాయమూర్తి ఈనెల 9వ తేదీకి వాయిదా వేశారు. కే సు విచారణకు అనువైన భవనం దొరికిన తర్వాత కేసు విచారణ షెడ్యూల్‌ను 9వతేదీ ప్రకటించే అవకాశం ఉంది.
కట్టుదిట్టమైన భద్రత
తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం పోలీసులతో నిండిపోయింది. 351 మంది ఎర్రకూలీలకు ఒక్కో కూలీకి ఒక్కో పోలీసును పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, ఏఆర్ పోలీసు డీఎస్పీ లియాజ్‌బాషా, కోర్టు మానటరింగ్ సిస్టమ్ సీఐ జగన్‌మోహన్‌రెడ్డి, ఎఎస్‌ఐ శ్రీరాములు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 351 మందిపై ఐపీసీ 302, 307, 332, 147, 148, 333, 120 (బి)తో పాటు ఫారెస్టు చట్టం కింద కేసు విచారణ జరగబోతోంది.
బంధువుల నిరీక్షణ
జ్యుడిషియల్ కస్టడీ నుంచి కేసు విచారణకు నిందితులను హజరుపరుస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితుల భార్యలు, పిల్లలు, బంధువులు వారి కోసం వేచి చూడడం కనబడింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు ప్రత్యేకంగా మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు. నిందితులతో కలసి మాట్లాడాలనే ప్రయత్నం మహిళలు చేయడం కనబడింది.