మార్కాపురం, న్యూస్‌లైన్: స్నేహితుని ఇంటికి వెళ్లిన ఓ ఆటో యజమానిని పట్టపగలు పిస్టల్‌తో నుదుటిపై కాల్చి హత్య చేసిన సంఘటన మార్కాపురంలో మంగళవారం సంచలనం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మృతుడు నాగూర్‌వలికి రెండు ఆటోలున్నాయి. వాటిని బాడుగకు తిప్పుతుంటాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాగూర్‌వలి పట్టణంలోని
విద్యానగర్ నాలుగో లైనులో నివాసం ఉంటున్న తన మిత్రుడు షేక్ మహబూబ్‌బాషా ఇంటికి వెళ్లాడు. మహబూబ్‌బాషా ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 11.30 నుంచి 12 గంటల మధ్య బాషా ఇంట్లో నుంచి పిస్టల్ పేల్చిన శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా..నాగూర్‌వలి రక్తపు మడుగు మధ్య మృతిచెంది ఉండటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతుని నుదుటిపై బుల్లెట్ గాయం ఉంది. చెవులు, ముక్కు, తలలో నుంచి రక్తం కారింది. డీఎస్పీ జీ రామాంజనేయులు, సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై దేవకుమార్‌లు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు నాగూర్‌వలికి సన్నిహితంగా ఉన్నవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని, ఆర్ధికపరమైన, అక్రమ సంబంధమైన కారణాలే హత్యకు కారణమై ఉండవచ్చునని భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య జరిగిన ఇంటి యజమాని మహబూబ్‌బాషా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హంతకునికి పిస్టల్ ఎలా వచ్చిందనే అంశం చర్చనీయాంశమైంది. మృతుడు నాగూర్‌వలికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
మృతుడు నాగూర్‌వలి తల్లి రోకాబి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైంది. రోకాబికి ఇద్దరు కుమారులు కాగా..నాగూర్‌వలి పెద్ద కుమారుడు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో నాగూర్‌వలి తమ్ముడు నాగూర్‌బాషాతో పాటు అతని తల్లి, కుటుంబ సభ్యులు అంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘అన్యాయంగా నా కొడుకును మీ పొట్టన పెట్టుకున్నారు. మీకేం ద్రోహం చేశాడని కాల్చి చంపారయ్యా..’ అంటూ రోకాబి విలపించిన తీరు చూపరులను కలచివేసింది.
పట్టపగలు దారుణం
Published Wed, May 28 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement