ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి
Published Sun, Sep 22 2013 2:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : మితిమీరిన వేగం ప్రాణం మీదికి తెచ్చింది. గొల్లప్రోలు శివారు 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గొల్లప్రోలు నుంచి పిఠాపురం వైపు వెళ్తున్న ఆటో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో పిఠాపురం మండలం మాధపురానికి చెందిన ఆటో డ్రైవర్ కరణం శ్రీను (35) మృతి చెందగా గొల్లప్రోలుకు చెందిన గ్రంధి లావణ్య, ఐతే వెంకటలక్ష్మి, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అపస్మారకస్థితిలో పడి ఉన్న డ్రైవర్‌ను, ఇద్దరు మహిళలను 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో డ్రైవర్ మృతి చెందాడు.
మిగిలిన వారు పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఐదుగురు ప్రయాణిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పిఠాపురం సీఐ ఎస్. రాంబాబు, టౌన్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, గొల్లప్రోలు ఏఎస్సై క్రిష్టియన్ సన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పొలంలో దూసుకుపోయిన ఆటో లోంచి క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మితి మీరిన వేగంతో ఆటోను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement