ఆటో, లారీ ఢీ : ఇద్దరు దుర్మరణం
ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు: జాతీయ రహదారిలోని దువ్వూరు సమీపంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని లారీ ఆటోను ఢీ కొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కురాకు నరేంద్రబాబు (26), కురాకు ఎలీశమ్మ (38) మృతి చెందారు. ప్రభాకర్, సంతోషమ్మ, ప్రభావతి, మస్తానమ్మ, శేఖర్, ప్రసాద్, సరోజమ్మ అనే వారు గాయ పడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ దువ్వూరు మండలంలోని ఏకోపల్లి గ్రామానికి చెందిన వారు. వీరంతా కూలిపనికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఏకోపల్లి గ్రామానికి చెందిన చాలా మంది కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బుధవారం ఎలీశమ్మతో పాటు సుమారు 15 మంది ఆటోలో రాజుపాళెం మండ లంలోని పర్లపాడు పొలాల్లోకి ధనియాల కట్టె పీకడానికి బయలు దేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో ఏకోపల్లి గ్రామంలోని చర్చి వద్దకు వెళ్లగానే వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీ ఢీ కొంది.
ఈ సంఘటనలో ఎలీశమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసేలోపే నరేంద్రబాబు మృతి చెందాడు. గాయపడిన వారిలో సరోజమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.
జిల్లా ఆస్పత్రిలో ఆర్తనాదాలు
జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. భార్యా భర్తలైన శేఖర్, సంతోషమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. శేఖర్‌కు కాలు విరగడంతో విలపించసాగాడు. సంతోషమ్మకు చెవిలో నుంచి రక్తం వస్తుండటంతో కుటుంబ సభ్యులందరూ భయాందోళన చెందారు. ప్రభాకర్‌కు స్వల్ప గాయాలైనప్పటికీ షాక్‌కు గురయ్యాడు. రెండు గంటల పాటు అతనసృ్పహలోకి రాలేదు.
ఆలస్యంగా సృ్పహలోకి వచ్చినప్పటికీ అతను ఎవరినీ గుర్తు పట్టలేకపోయాడు. భార్యను కూడా అతను గుర్తించలేని స్థితిలో ఉండిపోయాడు. రోడ్డు ప్రమాదంలో వృతి చెందిన ఎలీశమ్మకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. వైఎస్సార్‌సీపీ నాయకుడు వీఎస్ ముక్తియార్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
మాటిచ్చి వెళ్లిపోయావా బావా..
నరేంద్రబాబు చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో అతను అన్న వద్దనే ఉండేవాడు. ఎంబీఎ వరకూ చదివిన నరేంద్రబాబుకు నెల రోజుల క్రితమే హైదరాబాద్‌లోని అప్పోలో ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. ఇటీవలే అతను డ్యాన్స్ బేబీ డ్యాన్స్‌కు ఎంపికయ్యాడు. సంక్రాంతి పండుగ తర్వాత డ్యాన్స్‌బేబీ పోగ్రాంకు వెళ్లాల్సి ఉంది. కాగా అతనికి మూడు నెలల క్రితం తన అక్క కూతురు అయిన కుమారితో నిశ్చితార్థం అయింది.
హైదరాబాద్‌లో ఉన్న నరేంద్ర సంక్రాంతి పండుగ కావడంతో ఊరికి వచ్చాడు. నరేంద్రబాబుకు పంట పొలాలు అంటే చాలా ఇష్టం. తన బంధువులతో పాటు ధనియాల కట్టె పీకడానికి ఆటోలో వెళ్తూ మృత్యువాత పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాటిస్తివే బావా.. మాట నిలబెట్టుకోకుండానే వెళ్లిపోయావా అంటూ కుమారి విలపించడాన్ని పలువురిని కదిలించింది. దువ్వూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.