ఆంజనేయులు మృతదేహంతో ధర్నాకు దిగిన గ్రామస్తులు
పెబ్బేరు (కొత్తకోట): ఓ మహిళా సర్పంచ్ తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్ శివారులో జరుగుతున్న సర్పంచ్‌ల ప్రాంతీయ సమ్మేళనానికి బయలుదేరింది. మార్గమధ్యలో మృత్యురూపంలో దూసుకువచ్చిన లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మహిళా సర్పంచ్ తీవ్రంగా గాయపడింది. అలాగే లారీ స్థానిక బస్టాండ్‌లోకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధురాలు సైతం మృత్యువాతపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళా సర్పంచ్‌ను వనపర్తి కలెక్టర్ తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మండలంలోని గుమ్మడం క్రాస్‌రోడ్డు దగ్గర శనివారం చోటుచేసుకుంది.
కొత్తకోట సీఐ సోంనారాయణసింగ్ కథనం ప్రకారం.. వీపనగండ్ల మండలం సంపట్రావ్‌పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ పద్మమ్మ తన భర్త డీలర్ ఆంజనేయులు(50)తో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్ సమీపంలోని అప్పన్నపల్లిలో జరుగుతున్న సర్పంచ్‌ల ప్రాంతీయ సమ్మేళనానికి బయలుదేరారు. పౌరసరఫరాల శాఖ ప్రజాపంపిణీ రేషన్ బియ్యం లోడుతో ఓ లారీ యాపర్ల గ్రామానికి వెళ్తుంది. మార్గమధ్యలో పెబ్బేరు మండలం గుమ్మడం కాస్ర్‌రోడ్డు వద్ద లారీ, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఆంజనేయులు ఎగిరి లారీ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సర్పంచ్ పద్మమ్మ తీవ్రంగా గాయపడింది.
అలాగే లారీ అక్కడే ఉన్న బస్టాండ్‌లో దూసుకెళ్లడంతో అందులో ఉన్న సుశీలమ్మ(68) అనే వృద్ధురాలు మృత్యువాత పడింది. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా సకాలంలో రాలేకపోయింది. దీంతో గుమ్మడంలో అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీకి వచ్చిన వనపర్తి కలెక్టర్ శ్వేతామహంతి తన వాహనంలో పద్మమ్మను పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యసిబ్బంది మెరుగైన వైద్యం కోసం వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సంఘటనా స్థలానికి కొత్తకోట సీఐ సోంనారాయణసింగ్, శ్రీరంగాపూర్ ఎస్‌ఐ సురేష్, కొత్తకోట ఎస్‌ఐ రవికాంత్, వీపనగండ్ల ఎస్‌ఐ సాయిచంద్రప్రసాద్‌యాదవ్, సిబ్బంది చేరుకుని వివరాలు సేకరించారు. పెబ్బేరు నుంచి క్రేన్ రప్పించి లారీని బస్టాండ్‌లో నుంచి బయటకు తీసి మృతదేహాలను వెలికితీశారు. ఆంజనేయులుకు భార్య పద్మమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే సుశీలమ్మకు ఒక కుమారుడు ఉన్నారు.
పింఛన్ కోసం వెళ్లి..
చిన్నగుమ్మడానికి చెందిన సుశీలమ్మ తన కూతురును గోవర్ధనగిరిలో పింఛన్ తీసుకురావడానికి విడిచిపెట్టి తిరిగి క్రాస్ రోడ్డులోని బస్టాండ్ వద్ద వేచి ఉండగా లారీ దూసుకెళ్లడంతో మృత్యువాతపడింది. అనంతరం లారీకి సంబంధించిన అధికారులు రావాలని డీలర్ ఆంజనేయులు మృతదేహంతో కొల్లాపూర్ జెడ్పీటీసీ లోకారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ చంద్రారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణప్రసాద్, సంపట్రావ్‌పల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గంటపాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సీఐ సోంనారాయణసింగ్ నచ్చచెప్పినా వినిపించుకోలేదు.
సమాచారం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోన్‌లో పౌరసరఫరాల సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహాం అందించేలా కృషిచేస్తానని, అలాగే సొంతంగా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోలీసులు సంఘటనా స్థలంలో వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించి తన వాహనంలో క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించిన కలెక్టర్‌కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment