
సాక్షి, విశాఖపట్నం: దేశ చరిత్రంలో మే 23 మరచిపోలేని రోజు అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించి నేటీకి ఏడాది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ: గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించిన అత్యంత ఘన విజయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అన్నారు. 5 సంవత్సరాల్లో చేయాల్సిన పనులు ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి పూర్తి చేశారన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలతో పాటు.. విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, డ్వాక్రా సంఘాల మహిళలకు రుణ మాఫీ.. రైతు భరోసా అమలు చేశారన్నారు.
అంతేగాక గ్యాస్ ప్రభావిత కుటుంబాలను సీఎం జగన్ ఆదుకున్న తీరు మర్చిపోలేనిదన్నారు. నాయకునికి కావాల్సింది వయసు.. అనుభవం కాదు.. వైఎస్ జగన్ లాంటి పెద్ద మనసు ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఇక గ్యాస్ లీకేజీ ఘటన ప్రభుత్వానికి దెబ్బ అంటూ పచ్చ మీడియా ప్రచారం చేస్తోందన్నారు. అయితే ఏ దెబ్బనైనా తట్టుకునే శక్తి కేవలం సీఎం జగన్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకుల విద్యుత్ దీక్షలు ఓ పెద్ద జోక్ అని.. విద్యుత్ చార్జీలపై మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు, చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. బషిర్ బాగ్ సంఘటన ఇంకా జనం మర్చిపోలేదన్నారు. కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు 46 శాతం వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అందుతుంటే ఎక్కువ శాతం ఇతర పార్టీలకు అందుతున్నాయన్నారు. సహాయంలో సీఎంకు పార్టీలతో సంబంధం లేదని.. పేదలే ఆర్హులని మంత్రి అన్నారు.