వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్. చిత్రంలో పార్టీ సీనియర్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు పాలనలో కులప్రీతి, బంధుప్రీతి, అవినీతి తాండవం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపించాయని పప్పు బెల్లాల మాదిరిగా పథకాలు ప్రకటిస్తే గెలుస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అవంతి శ్రీనివాస్ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసిన ఆయన పలువురు సీనియర్ నేతల సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.
వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న అవంతి శ్రీనివాస్ పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించగా సాదరంగా ఆహ్వానించి వైఎస్సార్ సీపీ కండువాను కప్పారు. అంతకు ముందే ఆయన టీడీపీని వీడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపారు. ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ రెండు రాజీనామా లేఖలను శ్రీనివాస్ మీడియాకు విడుదల చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఇటీవలే పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, గుడివాడ, అమర్‌నాథ్‌తో సహా పలువురు నేతలు ఈ సందర్భంగా హాజరై అవంతి శ్రీనివాస్‌ను అభినందించారు.
జగన్ నిజాయితీ కలిగిన రాజకీయ నేత
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీ కలిగిన రాజకీయనేత (ఫెయిర్ పొలిటీషియన్) అని, చంద్రబాబు మాదిరిగా మాట మార్చి అవకాశవాదం ప్రదర్శించే వ్యక్తి కాదని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్ ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన సాధ్యమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడే తాము కూడా రాజీనామాలు చేద్దామని సూచించినా చంద్రబాబు అంగీకరించలేదని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ గెలిచారని, అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాజీనామాలు చేసి మళ్లీ గెలిచారని ఉదహరిస్తూ ఒకేసారి రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే దేశమంతా మనవైపు చూస్తుందని చెప్పినా చంద్రబాబు వినలేదని చెప్పారు.
పార్లమెంటులో తాము ధర్నాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించి అవిశ్వాసం పెట్టి సాధించిందేమిటి? అనేది ప్రజలే చూడాలన్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాకుండా చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో అంటకాగుతున్నారని విమర్శించారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా స్వీయ ప్రయోజనాలను వీడి రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించానన్నారు. విశాఖలో రైల్వే జోన్ కోసం ధర్నా చేస్తే తనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అవకాశవాదాన్నే ప్రదర్శించారని, ఆయన ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.
కేంద్రం దృష్టికి అవినీతి వ్యవహారాలు..
టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం ప్రధాని మోదీ కార్యాలయం దృష్టికి రావడంతో క్షుణ్నంగా దర్యాప్తు చేయించగా టీడీపీ సర్కారు అవినీతిమయంగా మారినట్లు తేలిందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఏపీలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందనే విషయం వెల్లడి కావడంతో అప్పటి నుంచీ రాష్ట్రానికి ఏమిచ్చినా ప్రయోజనం లేదనే అభిప్రాయానికి ప్రధాని మోదీ వచ్చారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నిఘా వర్గాల ద్వారా ఈ విషయాలను ఆయన తెలుసుకున్నారన్నారు. పార్లమెంట్ సభ్యులు ఎంత పోరాడినా రాష్ట్రానికి ఏమీ ఇవ్వక పోవడానికి కారణం ఇదేనన్నారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని, బంధుప్రీతి ఎక్కువైందని, కొంత మందికే న్యాయం చేస్తుండటంతో కేంద్రం మన కోర్కెలు వేటినీ అంగీకరించలేదని అవంతి పేర్కొన్నారు. చంద్రబాబు తనకు నచ్చినట్లు మాట్లాడితే సరి లేదంటే ప్రపంచంలో అందరితోనూ కుమ్మక్కు అయినట్లు ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపించినప్పుడు పప్పు బెల్లాల మాదిరిగా కొన్ని పథకాలు ప్రకటిస్తే నమ్మేసి ఓట్లేస్తారని ధీమాతో చంద్రబాబు ఉన్నారని, అయితే రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులని శ్రీనివాస్ చెప్పారు. చంద్రబాబు చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉండొచ్చు కానీ ప్రజల్లో చైతన్యాన్ని ఆపడం ఎవరి తరమూ కాదన్నారు.
జగన్ విజయాన్ని ఆపలేరు
వైఎస్సార్ మాదిరిగా జగన్‌కు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఎన్ని పథకాలు ప్రకటించినా జగన్ విజయాన్ని చంద్రబాబు ఆపలేరన్నారు. చంద్రబాబుకు ఇప్పుడే ప్రజలపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అంతా ఆలోచిస్తున్నారని చెప్పారు. జగన్ రూ.2,000 పింఛన్ ఇస్తానని నవరత్నాల్లో ప్రకటిస్తే చంద్రబాబు కాపీ కొట్టి అంతే మొత్తాన్ని ప్రకటించారని పేర్కొన్నారు.
ఆమంచి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లా బయటకు..
మోదీ కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తున్న చంద్రబాబు మరి రాష్ట్రంలో ఆయన చేస్తున్నదేమిటి? అని అవంతి ప్రశ్నించారు. 23 మంది విపక్ష ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి అక్రమంగా చేర్చుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఒక ఆదర్శవంతమైన విధానానికి కట్టుబడి పార్టీ మారేటప్పుడు కచ్చితంగా పదవులను వదులుకుని రావాలని సూచించారని చెప్పారు. ఆమంచి కృష్ణమోహన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లా బయటకు వచ్చారని టీడీపీ నుంచి ఇక వలసలు ప్రారంభం అవుతాయని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా ఉదాత్తమైన వ్యక్తి అని, ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన శత్రువును కూడా క్షమించారని అవంతి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో, ఏం చేస్తున్నారో పరిశీలించుకోవాలని సూచించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబే
ప్రజలను హింస పెట్టింది, కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తున్నపుడు తునిలో రైలు దగ్ధమైతే కడప నుంచి వచ్చిన వారు ఆ పని చేశారని చంద్రబాబు నిందించారన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ పరిశీలిస్తే తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్క పోలీసు అధికారిని కూడా నియమించలేదని ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందన్నారు. చంద్రబాబు తనను ఎవరూ ప్రశ్నించకూడదని భావిస్తున్నారని, అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోందో చాలా మంది సీనియర్లు, మంత్రులకు లై డిటెక్టర్లతో పరీక్ష నిర్వహిస్తే వాస్తవాలు చెబుతారని శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు పప్పు బెల్లాలు పంచి పెడితే ఓట్లేస్తారనుకోవడం పొరపాటన్నారు. దివంగత వైఎస్ కాపులకు చాలా చేశారని, అలాగే జగన్ కూడా చేస్తారన్నారు.
మాటకు కట్టుబడే వ్యక్తి జగన్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆది నుంచి ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా విషయంలో ఒకే వైఖరితో ఉన్నారని, చెప్పినట్లుగానే ఎంపీ పదవులకు రాజీనామాలు చేయించారని అవంతి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తరచూ వైఖరిని మార్చుకుంటూ గందరగోళానికి గురి చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మూడుసార్లు అవకాశం ఇచ్చారు కనుక ఆయన అవకాశవాద వైఖరి, పాలన ఎలా ఉందో పరిశీలించాలని ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితోపాటు జగన్‌పై ఎన్నో పుకార్లు పుట్టించారని, సుదీర్ఘ పాదయాత్ర చేసి తానేమిటో ప్రజల ముందు జగన్ ఆవిష్కృతుడయ్యారని పేర్కొన్నారు. జగన్ చాలా నిజాయితీగా ఉంటారని గెలుపు కోసం ఒకమాట, మరోసారి మరోమాట చెప్పరనేది గ్రహించాలన్నారు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజమని, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండే వ్యక్తి జగన్ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment