మంగళగిరికి చెందిన ఓ మహిళ విజయవాడలో కన్సల్టెన్సీలో పనిచేస్తోంది. కన్సల్టెన్సీకి కోర్సుల వివరాలు తెలుసుకోడానికి వెళ్లిన చినకాకానికి చెందిన యువకుడు ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. సర్టిఫికెట్ల గురించి మాట్లాడాలని ఈ నెల 15న ఆ యువకుడు సదరు మహిళను విజయవాడలో కలిశాడు. అనంతరం మంగళగిరికి వెళ్తే అక్కడ ఫ్రీగా మాట్లాడుకోవచ్చని నమ్మబలికాడు. హాయ్‌ల్యాండ్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి మహిళను తీసుకెళ్లాడు. అక్కడికి యువకుని స్నేహితులు ఇద్దరు చేరుకున్నారు. ముగ్గురూ కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
సాక్షి, గుంటూరు: అఘాయిత్యాలకు పాల్పడేందుకు నిందితులు వల విసురుతున్న విషయాన్ని మహిళలు, గుర్తించకపోవడం వల్లే తరచుగా అనర్థాలు సంభవిస్తున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాబోవు ప్రమాదాన్ని పసిగట్టి వేగంగా తప్పించుకోడానికి ప్రయత్నించినా, లేక చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చినా అనర్థాలు సంభవించడానికి అవకాశం ఉండదని చెబుతున్నారు. ఆపదలో ఉన్న సమయంలో మహిళలు, యువతులు బేలగా మారితే నిందితులు మరింత బలవంతులుగా మారుతారని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
దిశ ఎస్‌ఓఎస్‌తో రక్ష
♦ ఆపదలో ఉన్న ఆడపడుచులకు తక్షణ సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ ఎస్‌ఓఎస్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ పనితీరు ఇలా...
♦ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్‌లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ ఎస్‌ఓఎస్ యాప్ డౌన్‌లోడు చేసుకోవాలి.
♦ దిశ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మాత్రమే నెట్ అవసరం. తరువాత నెట్ లేకపోయినప్పటికీ యాప్ పనిచేస్తుంది.
♦ ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం (ఎస్‌ఓఎస్) బటన్ నొక్కితే చాలు. మీ ఫోన్ నంబరు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, మీ చిరునామా, దిశ కంట్రోల్ రూముకు చేరుతుంది
♦ ఆపదలో ఉన్న మహిళ, యువతి ఎస్‌ఓఎస్ బటన్ ప్రెస్ చేసే పరిస్థితిలో లేకపోతే ఆమె ఫోన్ గట్టిగా అటూ, ఇటూ ఊపితే చాలు. మీరు ఆపదలో ఉన్నారనే విషయం దిశ కంట్రోల్ రూమ్‌కు తెలిసిపోతుంది.
♦ ఒక వేళ బాధిత మహిళ ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే ఆమె వాయిస్‌తో పాటు అక్కడ జరిగే దృశ్యానికి సంబంధించి పది సెకన్ల వీడియో రికార్డు అవడానికి వీలుంటుంది.
♦ ఎస్‌ఓఎస్ బటన్ నొక్కగానే దిశ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి అక్కడి నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్‌కు, పోలీసు రక్షక్ వాహనాలకు ఆటోమ్యాటిక్‌గా సమాచారం చేరిపోతుంది.
♦ ప్రమాదంలో ఉన్నవారి చెంతకు వెంటనే చేరుకోవడానికి జీపీఎస్ ఉన్న పోలీసు రక్షక్ వాహనంలోని మొబైల్ డేటా టెర్మినల్ సహాయపడుతుంది.
♦ ఆపదలో ఉన్నామనే విషయం దిశ కంట్రోల్ రూముతో పాటు మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు ఇలా మొత్తం ఐదు నంబర్లకు దిశ యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
♦ దిశ యాప్‌లోని ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ వినియోగిస్తే మీరు ప్రయాణిస్తున్న వాహనం మీ గమ్యస్థానానికి కాకుండా ఇంకెక్కడికైనా వెళుతుంటే కూడా సమాచారం దిశ కంట్రోల్ రూముతోపాటు మీరు నమోదు చేసుకున్న ఐదు నంబర్లకు పంపి అప్రమత్తం చేయవచ్చు.
♦ ఈ యాప్‌లోనే డయల్ 100, 112, సహా ఇతర ఎమర్జెన్సీ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆపద సమయంలో సహాయం అర్థించవచ్చు.
♦ దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీసు స్టేషన్లు, ఆసుపత్రుల వివరాలు ఉంటాయి.
మహిళలు, యువతులు జాగ్రత్త వహించాలి
♦ గుర్తు తెలియని వ్యక్తులు మాటా మాటా కలిపి సాన్నిహిత్యం పెంచుకుంటుంటే తొలుత అనుమానించాలి.
♦ వ్యక్తిగత వివరాలను వారికి చెప్పకుండా జాగ్రత్త వహించాలి.
♦ ఎవరూ లేని ప్రాంతంలో ముక్కూ మొహం తెలియని వారు సాయం చేస్తామని ముందుకు వస్తే నిరాకరించాలి.
♦ నిర్మానుష్య ప్రాంతాల్లో స్కూటీ, కారు ఇతర వాహనాలు ఆగిపోతే ఒంటరిగా ఉన్నప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
♦ ఎప్పుడూ బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే, చాకు, కారం వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. ఆపద వచ్చినప్పుడు దాడికి ఉపయోగించుకోవాలి. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు నిందితుడిపై దాడి చేయడం ఆత్మరక్షణ కిందకే వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment