గుంటూరు, తుళ్లూరు: గతంలో ప్రతి ఒక్కరూ తమ వెంట ఫోన్ బుక్, అవసరమైన వాళ్లు కాలిక్యులేటర్, నగదు ఉంచుకునేవారు. కాలం మారుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు వివిధ రకాల కార్డులు భాగస్వామ్యం అయ్యాయి. ఆధార్, ఓటర్, రేషన్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం, పాస్‌పోర్ట్ తదితర కార్డులను సిటిజన్లు అధికంగా వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒకానొక కార్డును వినియోగించాల్సి వస్తోంది. ఆర్థిక లావాదేవీల కోసం ఏటీఎం కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యమైంది. ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అన్నీ ఒకేచోట ఉంచుకోవాల్సి వస్తోంది. అనుకోని పరిస్థితుల్లో మొత్తం కార్డులన్నీ ఒకేసారి పోగొట్టుకుంటే ఏమి చేయాలి? వాటిని తిరిగి ఎలా పొందాలన్న సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకు కంగారు పడాల్సిన అవసరం లేదని, కొంత సమయం తరువాత పొందే సదుపాయం ఉంది.
ఆధార్ కార్డు
భారతీయుడిగా గుర్తింపు ఉండాలి అంటే ఆధార్‌కార్డు తప్పనిసరి. ఎక్కడికెళ్లినా గుర్తింపు కోసం దీనినే అడుగుతున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. ఏ కార్డును పొందాలన్నా కూడా ఇది అవసరం. ఇలా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆధార్‌కార్డు పోతే టోల్ ఫ్రీ నంబర్ 18001801947 కి కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదుచేయాలి. ఇలా చేస్తే ఎలాంటి రుసుం లేకుండా కొత్త కార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. అలాగే ఆధార్ వెబ్‌సైట్‌కు వెళ్లి help@uiadi.gov.in లో పూర్తి సమాచారాన్ని పొందుపరిచి మళ్లీ కార్డును పొందవచ్చు.
పాస్‌పోర్టు
పాస్‌పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి పాస్‌పోర్టు లభించకుంటే నాన్ ట్రేస్డ్ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్ట్ అధికారి, హైదరాబాద్ పేరిట, రూ.1000 డీడీ తీయాలి. రెండింటినీ జతపరచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల అనంతరం డూప్లికేట్ పాస్‌పోర్టు జారీ చేస్తారు. తత్కాల్ పాస్‌పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.వివరాలకు www.ceoandhra.nic.in ను సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
ఓటరు కార్డు
ఓటరు గుర్తింపు కార్డు కూడా చాలా విధాలుగా పౌరులకు ఉపయోగ పడుతుంది. కేవలం ఓటు వేయడానికే కాకుండా నివాస, జనన తేదీ ధ్రువపత్రంగా కూడా కొన్ని సందర్భాల్లో దీనిని అడుగుతుంటారు. ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నంబర్‌తో రూ.10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రాల్లో మళ్లీ కార్డును పొందవచ్చు. కార్డు నంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా కార్డును పొందవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు కోసం మరిన్ని వివరాలకు www. passportindia.gov.in ను సందర్శించి తెలుసుకోవచ్చు.
రేషన్‌కార్డు
కుటుంబ అవసరాలకు రేషన్‌కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం అందించే సరుకుల కోసమే కాక పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్‌కార్డును కీలక ఆధారం. తెల్లకార్డు ఉంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య పథకం కూడా వర్తిస్తుంది. అత్యంత ప్రాధాన్యం ఉన్న రేషన్ కార్డును పొగొట్టుకుంటే బాధితులు www. icfs2.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ ఉన్న user name: guest, password: guest123 లాగిన్ అయి రేషన్‌కార్డు నంబర్‌ను వేసి రేషన్ జిరాక్స్ కాపీ ప్రతిని పొందవచ్చు. దీని ద్వారా ఏపీ ఆన్‌లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నంబర్‌పై కార్డును జారీ చేస్తారు.
డ్రైవింగ్ లైసెన్స్
వాహనం నడిపేందుకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అది పోతే వెంటనే స్థానికంగా ఉండే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయలి. వారందించే నాన్ ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిని ఎల్‌ఎల్‌డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీఓ కార్యాలయంలో అందించాలి. అలాగే రూ.10 బాండ్ పేపర్‌పై కార్డు పోవడానికి కారణాలను అందజేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. www.aptransport.org నుంచి ఎల్‌ఎల్‌డీ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని మరిన్ని వివరాలు పొందవచ్చు. అందులోని వివరాలను పొందుపరచడం ద్వారా కూడా పోయిన కార్డును పొందవచ్చు.
ఏటీఎం కార్డు
ఏటీఎం కార్డు పోగొట్టుకున్నా ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. తరువాత ఫిర్యాదు ఆధారంగా బ్యాంకులో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్ ఈ విషయాన్ని నిర్ధారించుకుని కొత్తకార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకుల నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి.
పాన్ కార్డు
ఆర్థిక లావాదేవీల్లో పాన్‌కార్డు ఇప్పుడు చాలా అవసరం. ఆదాయపన్ను శాఖ అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పాత కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా రూ.90 చెల్లించాలి. కొత్తకార్డు వచ్చే సరిని మూడు వారాల సమయం పట్టవచ్చు. www.nsdl.pan అనే వెబ్ సైట్‌లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment