ప్రత్యేక హోదా పై పార్లమెంట్ లో ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలని మంత్రి అయ్యన్న పాత్రుడు కోరారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తున్నందున పార్లమెంటులో ఇచ్చిన మాటను కేంద్రప్రభుత్వం నిలబెట్టుకోవాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన పాత్రుడు కోరారు. శుక్రవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాల్లో విభేదాలు సహజమని, టీడీపీ, బీజేపీలు పొత్తును వదులుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నా ఇంకా ఎక్కువగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో 1,300 పంచాయతీల్లో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నామని, 6 వేల పంచాయతీ భవనాలు, 2,500 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మించనున్నామని చెప్పారు. ఈ ఏడాది రూ.2,500 కోట్లతో గ్రామాల్లో 5 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను, డ్రైన్లను అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో శ్మశానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, పంచాయతీలు తీర్మానం చేసి పంపితే జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కో శ్మశానం అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. హుద్‌హుద్ తుపానులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.350 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో హుద్‌హుద్ వల్ల దెబ్బతిన్న రోడ్లను రూ. 61 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మంత్రితో ఉన్నారు.