బాబా.. బ్లాక్‌షీప్
ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్
‘నేనే దైవం.. నీ కష్టాలను నాతో చెప్పుకో తీరుస్తా’ అంటూ తామే దేవుళ్లమని ప్రజలను నమ్మించి కొందరు స్వామీజీల ముసుగులో ఉన్న నేరగాళ్లు అందిన కాడికి దోచుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయి. తాజాగా శివస్వామి లీలలు బయటపడ్డాయి. గతంలో జరిగిన కొందరు బాబాల మోసాలను పరిశీలిస్తే ప్రజల బలహీనతలే వారి ఆయుధాలని తేటతెల్లమౌతోంది. జాగ్రత్తగా ఉండకపోతే మూఢవిశ్వాసం ముంచేస్తుంది. - నెల్లూరు (క్రైమ్)
‘ప్రేమే దైవం.. ప్రేమతోనే మోక్షం.. ఉన్న దానిని కష్టాల్లో ఉన్నవారికి పంచితే దేవుని వద్దకు చేరుకుంటారు.’ ఇలా ప్రజలను మాయలో దించాడు. వారిని భక్తులుగా చేసుకున్నాడు. వారి వద్దనుంచి రూ.50 లక్షలు తీసుకొని ఉడాయించాడో స్వామీజీ. నెల్లూరు ఉడ్‌హౌస్ సంఘానికి చెందిన పాశం సురేష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. యువకులకు కరాటే, పెద్దలకు, మహిళలకు యోగా నేర్పించేవాడు. కీళ్లనొప్పులు, పక్షవాతం, క్యాన్సర్ తది తర వ్యాధులకు ఆయుర్వేద వైద్యం చేసేవాడు. ప్రతి రోజు సమయం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్నవారికి ప్రేమతత్వాన్ని బోధిస్తూ ప్రేమానందస్వామిగా అవతారమెత్తాడు. అతని ఆథ్యాత్మిక బోధనలకు ఆకర్షితులైన పలువురు ఆయన భక్తులుగా మారారు. బాలాజీనగర్‌కు చెందిన రవి అతని శిష్యుడిగా మారాడు.
అతనికి చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు. తాను సంపాదించిన మొత్తంలో అధికభాగం స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలకోసం వెచ్చించేవాడు. భక్తుల బలహీనతలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రేమానందస్వామి పన్నాగం పన్నాడు. అనాథలకు చేయూతనందించేందుకు సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. అందుకుగాను విరాళాలు అందించాలని కోరారు. అతని మాటలను నమ్మిన భక్తులు సుమారు రూ.50 లక్షల వరకు విరాళాలు అందించారు. వాటితో స్వామి ఉడాయించాడు. ఈ ఘటనపై రెండోనగర పోలీసులు కేసు నమోదు చేశారు.
దేవుడి ఆభరణాలను దొంగలించడంలో దిట్ట
నెల్లూరు నగరానికి చెందిన ఎన్.హనుమంతపవన్‌కుమార్ పలు దేవాలయాల్లో పూజారిగా పనిచేశారు. పనిచేసిన చోటల్లా అమ్మవారి ఆభరణాలను అపహరించి వాటిని అమ్మి సొమ్ముచేసుకొని జల్సాగా జీవించేవాడు. 2014లో ఆయన కొత్తూరు శ్రీలంక కాలనీలోని త మిళుల ఆరాధ్యదైవమైన ముత్తుమారియమ్మ ఆలయంలో పూజారిగా చేరాడు. అక్కడ అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను, ఆలయప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలోని వెండి కిరీటాన్ని అపహరించాడు.
ఒకటోనగర పోలీసుస్టేషన్‌లోనూ ఆయనపై దేవాలయంలో దొంగతనం కేసులున్నాయి. కంసాలివీధిలోని దుర్గమ్మ గుడిలో పూజారిగా చేరి పక్కనే ఉన్న దుకాణంలో వస్తువులను దొంగలించాడు. డ్రైవర్స్‌కాలనీలోని ముత్యాలమ్మగుడిలో పూజారిగా చేరాడు. అమ్మవారి మంగళసూత్రంను అపహరించుకొని వెళ్లారు. నిందితుడు నేరం చేసిన ప్రతిసారీ తన ఇంటి అడ్రస్‌ను మారుస్తూ ఉండటంతో అతనిని పట్టుకోవడ ం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దోపిడీలు, లైంగికదాడులు
నీకు ఆరోగ్యం బాగలేదు. నీవు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే నా వాంఛ తీర్చు అంటూ స్వామీజీ ముసుగులో ఉన్న కామాంధులు లేకపోలేదు.తోటపల్లిగూడూరుకు చెందిన శేషయ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అనంతరం స్నేహితులతో కలిసి ఆటోను బాడుగకు తీసుకొని ఆటోలో ప్రయాణికుడి వలే నటిస్తూ ఒంటరిగా ఆటోను ఎక్కిన మహిళలను బెదిరించి వారి వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకొనేవాడు. కొద్ది కాలానికి శేషయ్య స్వామీజి అవతారమెత్తాడు. బాలాజీనగర్‌కు చెందిన సుజనమ్మ అనే వృద్ధురాలిని భక్తురాలిగా చేసుకొని తన మాయమాటలతో మోసగించి ఆదిత్యనగర్‌లోని ఆమె స్థలాన్ని కాజేశాడు.
అనంతరం ఆ స్థలంలోనే సాయిబాబాగుడి కట్టాడు. నీలగిరి సంఘానకి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో అతని వద్దకు వచ్చింది. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకున్న శేషయ్య సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తనతో శారీరకంగా గడపాలనీ అప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుందని ఆమెకు సూచించాడు. గుడివద్దకు రమ్మని పిలిచి అక్కడ పూజలు చేస్తున్నట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. నిందితునిపై బాలాజీనగర్ పోలీసులు సస్పెక్టెడ్ షీటు తెరిచారు.
డబ్బులు రెట్టింపు చేస్తానని..
‘తాను భగవంతుని స్వరూపమని, తనకున్న శక్తితో నగదును రెట్టింపు చేస్తాను’ అని ప్రజలను నమ్మించి అందినకాడికి దోచుకెళ్లడం బి.శివ అలియాస్ శివశంకర్‌స్వామిజికి వెన్నతో పెట్టిన విద్య. చిత్తూరు జిల్లా కుప్పం తాలుకా వెండుగోంపల్లి. శివశంకరస్వామి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంట్లో నుంచి పరారయ్యాడు. కర్ణాటక రాష్ర్టంలోని కోలార్‌కు చెందిన ఓ స్వామిజీ అతనికి పరిచయం ఏర్పడింది. స్వామి వద్ద సులభమార్గంలో డబ్బు సంపాదించే విధానాలు నేర్చుకొన్నాడు. తొలిసారిగా కోలార్‌లోనే తన మోసాలకు బీజం వేశాడు. పూజల పేరిట నగదు, ఆభరణాలు రెట్టింపు చేస్తానని నమ్మించడం ప్రారంభించాడు.
అనంతరం పూజలు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ వారికి నైట్రోవేట్ నిద్రమాత్రలు కలిపిన ప్రసాదాలు తినిపించేవాడు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే నగదు, నగలుతో ఉడాయించేవాడు. 2014జూన్‌లో తిరుపతి ఆటోనగర్‌లో శివశంకర్‌స్వామిజి పూజలు చేస్తున్నట్లు నటిస్తూ భక్తులకు నిద్రమాత్రలు కలిపిన ప్రసాదాన్ని తినిపించి రూ.63లక్షలు దోచుకెళ్లాడు. ఇది జరిగిన మరుసటి రోజే నెల్లూరు మాగుంట లేఅవుట్‌లోని పావనీ టవర్స్‌లో ఓ కాంట్రాక్టర్‌ను బురిడీ కొట్టించి రూ.40 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటనపై నెల్లూరు నాల్గో నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే స్వామీజీల ముసుగులో నేరాలకు పాల్పడే ఘరానా దొంగల జాబితా చేంతాడంత ఉంటోంది. తాజాగా మే 17వతేదీన నెల్లూరు జెండావీధికి చెందిన సయ్యద్ ఆసీఫా, ఇర్షాద్ ఇంట్లో దెయ్యాలున్నాయని పూజలు చేస్తున్నట్లు నటించి 40 గ్రాముల బంగారం, రూ.50వేల నగదు అపహరించుకొని వెళ్లారు.
దొంగ బాబాలను నమ్మొద్దు
ఇటీవల కాలంలో కొందరు నేరగాళ్లు బాబాలు, స్వామీజీలుగా అవతారమెత్తి నేరాలకు పాల్పడుతున్నారు. నగదు రెట్టింపు చేస్తామనీ, ఆరోగ్యం నయం చేస్తామని, ఇంట్లో శాంతిపూజలు చేస్తామంటూ ఇలా పలువుర్ని మోసగించి అందిన కాడికి దోచుకెళుతున్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే తాము ఈ తరహా నేరగాళ్లపై నిఘా ఉంచాం. వారు తారసపడితే వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - జి.వెంకటరాముడు, నెల్లూరు నగర డీఎస్పీ