సీఎం చంద్రబాబుకు శాలువ కప్పుతున్న శంకర స్వామి (ఇన్‌సెట్) చోరీ కేసులో నిందితునిగా పలక పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో స్వామి(ఫైల్)
ప్రత్యేక హోదా పేరిట గత మంగళవారం ఏయూ గ్రౌండ్స్‌లో టీడీపీ చేపట్టిన ధర్మపోరాట సభకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఏకబిగిన గంటన్నరసేపు ఉపన్యాసం దంచేసి వెళ్లారు. అక్కడితో ఆ విషయం అందరూ మర్చిపోయారు. కానీ చంద్రబాబు ఆ రోజు సాయంత్రం ఎయిర్‌పోర్టులో ఓ స్వామి నుంచి ఆశీస్సులు పొంది.. వంగి వంగి దండాలు పెడుతూ చూపించిన భక్తిప్రపత్తులే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి.సహజంగా సీఎం స్థాయి ప్రముఖుల వద్దకు వెళ్లాలనుకునే వారికి చాలా పలుకుబడి ఉండాలి. లేదంటే సమాజంలో మంచి గౌరవప్రతిష్టలైనా ఉండాలి.కానీ చంద్రబాబును ఆ రోజు కలవడమే కాకుండా.. ఆశీస్సులు అందించిన ఆ స్వామి స్థాయి ఏమిటో.. ఆయన ఘన చరిత్ర ఏపాటిదో తెలిస్తే ఎవరైనా బిత్తరపోతారు.ఎందుకంటే సదరు స్వామిపై ఒక దొంగగా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదై ఉంది. కోర్టుకు వెళ్లని నిందితుడన్న ట్రాక్ రికార్డ్ ఉంది. అటువంటి వ్యక్తి బాబా అలియాస్ స్వామిగా ఎలా మారాడు?.. నేరుగా సీఎం వద్దకు ఎలా వెళ్లగలిగాడు??.. బాబు ప్రత్యేకంగా ఆయన ఆశీస్సులెందుకు తీసుకున్నారు???...
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : నగరంలోని కప్పరాడ ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న శంకర సదానంద స్వామి అలియాస్ శంకరస్వామి అలియాస్ శ్రీ శంకర విద్యానంద సరస్వతి స్వామికి వివాదాస్పదుడిగా పేరుంది. 2014 మే నెలలో పోలీసు జీపు నుంచి వైర్‌లెస్ సెట్, మైక్రో ఫోన్, వాకీటాకీ తదితర సామాగ్రి దొంగిలించాడంటూ నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కానిస్టేబుల్ శివకుమార్ ఫిర్యాదు మేరకు అప్పటి సర్కిల్ ఇనస్పెక్టర్ లక్ష్మణరావు సదరు శంకరస్వామిని ఐపీసీ 379 సెక్షన్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఆ తర్వాత కూడా శంకరస్వామిపై పలు ఆరోపణలు వచ్చాయి.
రాత్రిపూట బీచ్‌రోడ్‌లో బ్లూలైట్ తగిలించిన కారులో తిరుగుతూ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్‌నని ప్రజలను మభ్యపెట్టిన దాఖలాలూ ఉన్నాయి. ఇక ఇటీవలే సదరు స్వామి ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కార్ల షోరూమ్‌లో డస్టర్ వాహనం కొనుగోలు చేశాడు. కేవలం రూ.5 వేలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి.. మిగిలిన మొత్తం మూడురోజుల్లో ఇస్తామని నమ్మబలికి పోస్ట్‌డేటెడ్ చెక్ ఇచ్చాడు. స్వామీజీనని చెప్పడంతో నమ్మిన షోరూమ్ నిర్వాహకులు తామే డ్రైవర్‌ను పెట్టి ఆయనకు కొత్త వెహికల్ ఇచ్చేశారు. కానీ పది రోజులైనా నయాపైసా కూడా ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి వెహికల్‌ను వెనక్కి తీసేసుకున్నారు.
వంగి వంగి దండాలెందుకు..?!
ఇప్పుడు ఇతగాడి చరిత్రంతా ఎందుకంటే.. ఇంతటి ఘనమైన స్వామికి సీఎం చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టి మరీ ఆశీస్సులు అందుకున్నారు. సీఎం వద్దకు సదరు స్వామిని ఎవరు తీసుకువెళ్లారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత మంగళవారం ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ధర్మపోరాట సభకు హాజరయ్యేందుకు సీఎం సాయంత్రం 3.30గంటల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే వీఐపీ లాంజ్‌లో సదరు స్వామి, మరో పురోహితుడితో కలిసి వేచి ఉన్నారు. సీఎం రాగానే పురోహితుడు వేదమంత్రాలు పలకగా.. స్వామి సీఎంకు శాలువా కప్పి పండ్లు అందజేశారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే గణబాబు పక్కనే ఉన్నారు. సీఎంను కలవాలంటే.. అది కూడా ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో కలవాలంటే అంత సులువేమీ కాదు. రెవెన్యూ అధికారులు ముందుగానే ఖరారు చేసే ప్రొటోకాల్ జాబితాలో పేరుంటేనే అక్కడ సీఎంను కలిసే వీలుంటుంది. మరి సదరు స్వామి పేరును ఎవరు సిఫారసు చేశారు.. ఎవరు దగ్గరుండి కలిపించారు.. అన్నది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉంది. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులను వివరణ కోరితే.. ఎవరికి వారు మాకేమీ సంబంధంలేదంటూ తప్పించుకునే ధోరణిలోనే మాట్లాడుతున్నారు.
సీఎంకు ఆశీస్సులిచ్చే ఫొటోలతో హల్‌చల్
సరే.. సీఎంను కలిశారు.. ఆశీస్సులు అందించారు.. అక్కడితో అయిందేదో అయిందనుకుంటే ఏ గొడవా లేదు. స్వయంగా సీఎంకు ఆశీస్సులు అందించిన ఫొటోలతో సదరు బాబా అప్పుడే హల్‌చల్ చేస్తున్నారని అంటున్నారు. సీఎంతో ఉన్న ఫొటోలతో మూడురోజుల కిందట నగరంలోని ఓ బడా వస్త్ర దుకాణానికి వెళ్లి సీఎంకే దీవెనలిచ్చిన స్వామీజీనని బిల్డప్ ఇచ్చి.. కావాల్సిన దుస్తులు ఫ్రీగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు,.. ఇక్కడ పీఠం పెడతానని, ప్రభుత్వపరంగా ఓ స్థలం ఇప్పించాలని జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతను కలిసి కోరినట్టు సమాచారం.
మాకే సంబంధం లేదు.. ప్రొటోకాల్ బాధ్యత రెవిన్యూదే:ఏసీపీ
ఆ రోజు సీఎం వచ్చినప్పుడు ఎయిర్‌పోర్టు వద్ద బందోబస్తు బాధ్యత మాదే.. కానీ ఆయన్ను వీఐపీ లాంజ్‌లో ఎవర్ని కలిశారో మాకు తెలియదు.. అదంతా రెవెన్యూ అధికారుల బాధ్యత.. ప్రొటోకాల్ లిస్టు ప్రకారమే పంపిస్తారు.. కానీ ఆ లిస్టును రెవెన్యూ వాళ్ళే ఖరారు చేస్తారు.. అని ఏసీపీ లంకా అర్జున్ చెప్పారు.
అవును.. ఆశీస్సులిచ్చారు..కానీ.. అర్బన్ తహసీల్దార్ నాగభూషణరావు
అవును.. ఆ రోజు శంకరస్వామి ఎయిర్‌పోర్టులో చంద్రబాబును కలిసి శాలువాతో సత్కరించి పండ్లు ఇచ్చి ఆశీస్సులు అందజేశారు. స్వామిని అక్కడికి ఎవరు రమ్మన్నారో మాకూ తెలియదు.. సీఎం వచ్చేటప్పటికి అక్కడున్నారు.. సీఎంను కలుస్తామంటే భద్రతా సిబ్బందితో మాట్లాడి పంపించాం. అంతకుమించి మాకేమీ తెలియదని అర్బన్ తహసీల్దార్ నాగభూషణరావు తెలిపారు.
ఏమో నాకైతే ఏమీ తెలియదు ఇన్‌చార్జి ఆర్డీవో సత్తిబాబు
ఏమో.. ఆరోజు సీఎంను కలిశారేమో.. నాకైతే గుర్తు లేదు..మా వాళ్లు ఏమైనా అరేంజ్ చేశారేమో నాకైతే ఏమీ తెలియదు.. అని విశాఖ ఇన్‌చార్జి ఆర్డీవో సత్తిబాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment