బావిలో పసికందు మృతదేహం
పుట్టిన రోజే చావురోజు
కవరులో పెట్టి బావిలో వేసిన వైనం
తాడేపల్లి రూరల్ : పెనుమాక గ్రామంలోని కొత్తూరు ప్రాంత తాగునీటి బావిలో గురువారం ఆడ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సెల్‌ఫోన్ ప్యాకింగ్ కవర్‌లో ఆ పసికందు మృతదేహాన్ని చుట్టి బావిలో పడవేసినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహం ఉబ్బి ఉండడంతో రెండు కాళ్లూ కవరను చీల్చుకుంటూ బయటకు వచ్చాయి. ముందు స్థానికులు ఏదో జంతువు మృతదేహం అనుకున్నారు. స్థానికంగా నివసించే యువకులు బావిలోకి దిగి పరిశీలించగా ముక్కుపచ్చలారని పసికందు కనిపించింది. బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో ఎవరైనా తీసుకువచ్చి బావిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వీఆర్వో ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. స్థానికులు మాత్రం ఈ పసికందు మృతదేహాన్ని మంగళగిరి నుంచి తీసుకువచ్చి స్థానికుల సహాయంతో బావిలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాన్ని తీసుకువచ్చిన కవర్‌పై విమలా మొబైల్స్, నవతా ట్రాన్స్‌పోర్టు ఆపోజిట్, మంగళగిరి అని ఉంది. దీంతో కవర్ ఆధారంగా స్థానికులు మంగళగిరికి చెందినవారే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పెనుమాకలోనే పంచాయతీ కార్యాలయం సమీపంలో ఆడపిల్లను తీసుకువచ్చి కవర్‌లో ప్యాకింగ్ చేసి బావిలో పడవేసిన ఘటన జరిగింది. బహుశా అక్రమ సంబంధాల నేపథ్యంలో ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించి, ఎవరికీ తెలియకుండా ఇలా చేశారేమోనని, దానికి స్థానికులు ఎవరైనా సహకరిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు మంగళగిరి, పెనుమాక తదితర ప్రాంతాల్లో ఉన్న అంగన్‌వాడీ టీచర్ల ద్వారా ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో సీసీ కెమెరాల ఫుటేజిని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.