బాబూ రాజీనామా చేసి.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకో..
ఎమ్మెల్యేలు పిఆర్కే, గోపిరెడ్డి
రెంటచింతల : రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సామాన్య ప్రజలు బతికే పరిస్థితిలు కన్పించటంలేదని మాచర్ల, నర్సరావుపేట ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం రెంటచింతలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రాని దోచుకుందాం.. అనే ధోరణిలో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు పీకలదాకా కూరుకుపోయారని ఆ కేసు నుంచి బయటపడేందుకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ , సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
బాబు వెంటనే రాజీనామా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సిద్ధం కావాలని సవాలు చేశారు. ఓటుకు నోటు విషయంలో పట్టపగలే పట్టుబడ్డ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో వచ్చిన కమీషన్లతో తెలంగాణాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీమాంధ్ర ప్రజల పరువుతీశారని దుయ్యబట్టారు. రైతులు, మహిళల ఓట్లతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు వారిని నిలువన మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితిలలో రాష్ర్టంలో ఎమర్జన్సీ పాలన అమలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డి, వైసీపీ నాయకులు గోగుల సీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.