
నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ప్రశాంతతను చెడగొట్టడమే ధ్యేయంగా టీడీపీ నాయకులు పని చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడేం జరిగినా దానికి రాజకీయ రంగు పులిమి నరసరావుపేటలో బంద్‌లు, ఆందోళనలు చేసి శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తూ.. ప్రజల్లో ప్రశాంతతను చెడగొట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. హత్యకు గురైన మాచర్ల మండలం దుర్గికి చెందిన కంచర్ల జాలయ్యకు నేరచరిత్ర ఉందని, అతడో రౌడీషీటర్ అని గుర్తు చేశారు. అతడి హత్య రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్నారు.
బ్రహ్మారెడ్డి ఇన్‌చార్జి అయ్యాకే..
మాచర్ల టీడీపీ ఇన్‌చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించాక హత్యా రాజకీయాలు మొదలయ్యాయని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 2009లో బ్రహ్మారెడ్డి నియోజకవర్గాన్ని విడిచి గుంటూరు వెళ్లాక 2022 వరకు 13 ఏళ్లపాటు ఎటువంటి ఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఆయన తిరిగి వచ్చాకే ఇలాంటి ఘటనలు ప్రారంభమయ్యాయనే విషయం అర్థమవుతోందన్నారు. సత్తెనపల్లికి చెందిన ఓ విద్యార్థి హత్య జరిగితే «నరసరావుపేటలో ధర్నా చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. జొన్నలగడ్డలో ఓ మహిళకు అన్యాయం జరిగిందంటూ ధర్నా చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారన్నారు. ఎక్కడ ఘటన జరిగితే అక్కడ ఆందోళన చేస్తే తప్పేమీ లేదన్నారు.
ఏ ఘటనకు స్పందించాలో, దేనికి స్పందించకూడదో నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జికి తెలియదన్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుంటే గుండెనొప్పి వచ్చినట్టు సెంటిమెంట్ డ్రామాకు తెరతీసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడన్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్‌సీపీ వారిని కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా రానివ్వలేదన్నారు. ఇప్పడేదో బుద్ధిమంతులు మాదిరిగా చంద్రబాబు, లోకేశ్ వ్యవహరిస్తున్నారన్నారు. అధికారం కోసం పాకులాడుతూ.. 12 కేసులు పెట్టించుకున్నవారే టీడీపీ కార్యకర్తలంటూ వారిని రెచ్చగొడుతున్నారన్నారు. ఎక్కడో ఏదో జరిగితే నరసరావుపేటలో ఆందోళనలు చేస్తే ఊరుకునేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.