ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి
నరసరావుపేట రూరల్: రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లా చినతురకపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే, నేడు చంద్రబాబు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి బీజేపీ పెద్దలతో కాళ్లబేరాలకు దిగాడని విమర్శించారు. బీజేపీ విధించిన మూడు షరతులకు టీడీపీ అంగీకరించిందని చెప్పారు. ముస్లింలకు కల్పిస్తున్న నాలుగుశాతం రిజర్వేషన్‌ను తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా రద్దుచేస్తామని బీజేపీ కేంద్ర నాయకుడు అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారన్నారు.
అలాగే ప్రత్యేకహోదా ఊసే ఎత్తవద్దన్న బీజేపీ పెద్దల మాటలకు చంద్రబాబు మద్దతు ఇచ్చారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా చంద్రబాబు మద్దతు తెలిపి బీజేపీతో పొత్తును ఖాయం చేసుకున్నారని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్ వలన లబి్ధపొందిన గ్రామాల్లో చినతురకపాలెం ఒకటన్నారు. 2007 వరకు కనీసం ఇంజినీరింగ్ చదివిన వారు కూడా గ్రామంలో లేరని, పేదరికం కారణంగా ఉన్నతవిద్యకు గ్రామ విద్యార్థులు దూరమయ్యారని తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ముస్లిం రిజర్వేషన్ నాలుగుశాతం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వలన గ్రామంలో విద్యావిప్లవం వ చ్చిందన్నారు. నేడు 29 మంది వైద్యులు గ్రామం నుంచి వచ్చారని, దీనికి నాలుగుశాతం రిజర్వేషన్ కారణమని తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బీజేపీతో కాళ్లబేరానికి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో రహస్య ఒప్పందం మేరకు ముస్లిం రిజర్వేషన్‌ను రద్దుచేస్తే వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment