కొందరికే ‘భరోసా’ | Babu to Launch 'Swachh Bharat' in City | Sakshi
Sakshi News home page

కొందరికే ‘భరోసా’

Published Fri, Oct 3 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

కొందరికే ‘భరోసా’

కొందరికే ‘భరోసా’

 ‘హడావుడి ఎక్కువ.. అసలు తక్కువ’ అన్న తీరుగా సాగింది ‘జన్మభూమి-మా ఊరు’ తొలిరోజు కార్యక్రమం. ఇందులో భాగంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ.. ఎన్టీఆర్ సుజల పేరుతో రూ.2కే 20 లీటర్ల మంచినీరు అందించే పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్ భరోసాతో పెంచుతున్న పింఛను ద్వారా సంతోషం, ఆరోగ్యం, సంతృప్తి, భద్రత, భరోసా.. ఇవన్నీ ఇక నుంచి 5 రెట్లు అవుతాయంటూ ప్రచారం కూడా చేసింది. కానీ, తొలి రోజు ఈ కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. ఉన్న పింఛను కూడా ఊడిపోవడంతో అనేకమంది నిరాశకు గురయ్యారు. మరోపక్క దాతలు ముందుకు రాకపోవడంతో ఎన్టీఆర్ సుజలను కూడా తూతూమంత్రంగానే సరిపెట్టారు.
 
 సాక్షి, కాకినాడ :రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. దీంతోపాటు సామాజిక పింఛను పథకం ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ సుజల పథకాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యనాంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎన్టీఆర్ సుజలను.. తొండంగి మండలం ఏవీ నగరంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కలెక్టర్ నీతూ ప్రసాద్‌లు ఎన్టీఆర్ భరోసాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. తొలి రోజు స్వచ్ఛతా ర్యాలీలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇతర కార్యక్రమాలకు ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ భరోసాతో పాటు
 ఎన్టీఆర్ సుజల కార్యక్రమాలు
 మొక్కుబడిగానే సాగాయి.
 
 పింఛన్‌దారుల ఉత్సాహంపై నీళ్లు
 జిల్లావ్యాప్తంగా గురువారమే ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పింఛనుదారులకు రూ.1000, రూ.1500 పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలిరోజున మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నచోట కూడా ఒకరిద్దరికి మాత్రమే పంపిణీ చేశారు. పంపిణీ చేయదల్చుకున్నవారిని మాత్రమే ఆర్వో ప్లాంట్ల ప్రారంభోత్సవాలకు ఆహ్వానించి అక్కడే పింఛన్లు అందించారు. ఇంకెవరైనా పింఛన్ల కోసం వస్తే వారికి ‘శనివారం నుంచి పంపిణీ చేస్తాం. కంగారు పడకండి’ అంటూ నచ్చజెప్పి వెనక్కి పంపిన ఘటనలు అక్కడక్కడ కనిపించాయి. ముఖ్యంగా అనర్హులుగా గుర్తించినవారు ఈ కార్యక్రమాల ఛాయలకు కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. జిల్లాలోని ఆరేడు నియోజకవర్గాల్లో అసలు పింఛన్లు పంపిణీ చేసిన దాఖలాలే కనిపించలేదు. దీంతో పెంచిన పింఛను మొత్తం చేతికందుతుందని ఎంతగానో ఆశించినవారు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
 
 90,981 మంది పింఛన్లు రద్దు!
 ఒకపక్క ఇప్పటివరకూ జరిగిన పరిశీలనలో 40,509 మందిని అనర్హులుగా ప్రకటించగా, మరో 50,472 మందికి వివిధ కారణాలతో ఈ నెల పింఛన్లు నిలిపివేసినట్టు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలో ఇప్పటివరకూ 4,65,617 మంది పింఛనుదారులు ఉండగా, వీరిలో 3,74,636 మందికి మాత్రమే ఈసారి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో బోగస్‌గా గుర్తించినట్టు చెబుతున్న 40,509 మందితో పాటు వివిధ కారణాలతో ఈ నెలకు మాత్రమే నిలిపివేశామని చెబుతున్న 50,472 మంది తమ పింఛన్లు ఉన్నాయో లేవో తెలియక ఆందోళన చెందుతున్నారు. సర్వే సమయంలో లేరని, ఆధార్ కార్డులు లేవన్న కారణాలతో ఈ 90,981 మంది పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలుస్తోంది. 4వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే సమయంలో వారినుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క అనర్హులను గుర్తించినప్పటికీ ఆ జాబితాలను గ్రామస్థాయిలో మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
 
 లక్ష్యం ఘనం.. ‘సుజలం’ స్వల్పం
 ఇక ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా జిల్లాలో 612 రివర్‌‌స ఓస్మోసిస్ (ఆర్వో) ప్లాంట్లు ప్రారంభించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట్లో కనీసం 400 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దాతలు ముందుకు రాకపోవడంతో చివరకు 67 ప్లాంట్లతో సరిపెట్టారు. వీటిల్లో తొలి రోజు జిల్లావ్యాప్తంగా 25 ఆర్వో ప్లాంట్లు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. చివరి క్షణాల్లో ఆదరాబాదరాగా ఏర్పాటు చేసిన ప్లాంట్లు సాంకేతిక కారణాలతో పలు చోట్ల మొరాయించాయి. రాజమండ్రి ఒకటో డివిజన్‌లో ఆర్వో ప్లాంట్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. దీనిని గురువారం ప్రారంభించేందుకు ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. కానీ మోటారు పని చేయకపోవడంతో ప్రారంభించకుండానే వారు వెనుదిరిగారు. మరికొన్నిచోట్ల నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ప్రారంభింపజేసి, ఆ తంతు ముగిసిన కొద్ది క్షణాలకే మళ్లీ మూసేశారు.
 
 ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో     {పొటోకాల్ ఉల్లంఘన
 ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ అన్నీ తామై ప్రభుత్వ పథకాలు ప్రారంభించారు. ఏలేశ్వరంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవానికి అధికారుల ఆహ్వానం మేరకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు హాజరయ్యారు. ఆయనను పట్టించుకోకుండా ఎంపీ తోట నరసింహం ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement