ఎంపీ సీఎం రమేశ్‌కు చేదు అనుభవం
► రోడ్డు వేశాకే వీధిలోకి అడుగుపెట్టాలని ముస్లిం మహిళల డిమాండ్
సాక్షి, చాపాడు: టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చుక్కెదురైంది. బుధవారం వైఎస్సార్ జిల్లా చాపాడులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ముస్లిం మైనార్టీ మహిళలు నిలదీశారు. జెడ్పీ హైస్కూల్ వెనుక వీధిలో ఆయన పర్యటించగా... సిమెంట్ రోడ్డు వేశాకే వీధిలోకి రావాలని మహిళలు అడ్డుకున్నారు. తమ వీధిలో సిమెంట్ రోడ్డు వేయాలని మూడేళ్లుగా విన్నవిస్తున్నా పట్టించుకోలేదని, ఇప్పుడొచ్చి మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదని పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం కాదని, చేసి చూపించాలని స్పష్టం చేశారు. గట్టిగా అరవొద్దు.. చిన్నగా చెప్పండని సీఎం రమేశ్ చెప్పగా... సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలోకి అడుగుపెట్టాలని మహిళలు తెగేసి చెప్పారు. అలాగే టీడీపీకి చెందిన పలువురు సర్పంచ్‌లు స్పెషల్ గ్రాంటు కింద చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని సీఎం రమేశ్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.