
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రాజమౌళి క్రియేటర్ అని, బాహుబలి సినిమాలో డిజైన్లు బాగా చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అందుకే రాజధానిపై ఆయన అభిప్రాయం అడిగానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ పత్రికలో తాను నీళ్లు దొంగిలించుకుపోయినట్లు రాశారని, నీళ్లిస్తున్నా అడ్డుకుంటున్నారని, ప్రజల్ని రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సదావర్తి భూములపైనా ప్రతిపక్ష పార్టీ పేపర్‌లో ఏదేదో రాస్తున్నారన్నారు. సదావర్తి భూములకు వేలం వేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా తనకు తెలియదని చెప్పారు. వచ్చే 2019 ఎన్నికల్లోనే కాదు.. 2024 ఎన్నికల తర్వాత కూడా తానే అధికారంలో ఉంటానని చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ అధికారం కోసం పని చేయలేదన్నారు. తనకు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వద్దన్నానని చెప్పారు.
కుటుంబంకోసం డెయిరీ పెట్టా : తన కుటుంబం కోసం ఏంచేయాలని ఆలోచించి 1989–94 మధ్య ప్రతిపక్షంలో ఉండగా డెయిరీ పరిశ్రమ పెట్టానని, దాన్ని ఇప్పుడు తన కుటుంబసభ్యులు చూసుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ను తన బ్రెయిన్ చైల్డ్‌గా అభివర్ణించారు. అక్కడ అడుగడు గునా తన ముద్ర ఉంటుందని పేర్కొన్నారు.
రోజూ విజువలైజేషన్ ఎక్సర్‌సైజ్ చేస్తా : తాను ప్రతిరోజూ ఉదయం విజువలైజేషన్ ఎక్సర్‌సైజ్ చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో ధ్యానం చేసే వాడినని కొద్దిరోజుల నుంచి అది మానేసి ఈ ఎక్సర్‌సైజ్ చేస్తున్నానన్నారు. విజువలైజేషన్ అంటే ఏమిటని మీడియా ప్రతినిధులు అడగ్గా.. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వాటిని గుర్తు చేసుకుంటా నని, తానెవరు, ఎక్కడి నుంచి వచ్చా, ఏం చేశా, ఏం చేస్తున్నా, ఏంచేయాలి, తన లక్ష్యం ఏమిటో గుర్తుచేసుకుంటానని చెప్పారు.