బాలరాజుకు ఎదురుగాలి
చింతపల్లి, న్యూస్‌లైన్: మాజీ మంత్రి బాలరాజుకు సొంత మండలంలోనే ఎదురుగాలి వీస్తోంది. ప్రతి ఎన్నికలల్లో ఆయనకు వెన్నుదన్నుగా ఉండే చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల ప్రజలు ఈ ఎన్నికల్లో ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 2009 ఎన్నికల్లో బాలరాజు విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు ఈసారి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉండడమే కాకుండా ఉద్యోగులను వేధించి తన నైజాన్ని బహిర్గతం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. బాలరాజు మంత్రిగా ఉన్నంత కాలం ఆయన సతీమణి పెత్తనం కూడా ఇబ్బందికరంగా ఉండేదన్న భావం చాలామందిలో ఉంది.
1989లో తొలిసారిగా చింతపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలరాజు కొద్ది రోజులకే ప్రజలు, ఉద్యోగుల వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. అనుకూలంగా లేని ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువయ్యాయి. దాంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత మూడు సార్లు జరిరగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడారు. దాంతో రూట్ మార్చారు.
గత ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు.
‘గతంలో తప్పుగా వ్యవహరించి ఉంటే మన్నించండి.. ఇకపై మారతాను.. నన్ను నమ్మండి’ అంటూ సమావేశాల్లో ఉద్యోగులను వేడుకున్నారు. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ పథకాల అండతో ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక వెనకటి బుద్ధి చూపించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తూ ఉంటే ఆయన అందుకు భిన్నమైన ధోరణిని అనురించిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. చింతపల్లిలో జేఏసీ నేతల అరెస్ట్‌ల వెనుక ఆయన సూత్రధారిగా వ్యవహరించారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతా జరిగాక ఆయనకెలా మద్దతిస్తామని ప్రశ్నిస్తున్నారు.