ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నీలం తుపాన్‌తో దెబ్బతిన్న రోడ్ల ప్రతిపాదనలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి పంపకపోవడంతో వాటిని మరమ్మతు చేయలేకపోయామని, ఈ విషయంలో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. మూడో విడత రచ్చబండ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే దెబ్బతిన్న రోడ్లుకు అవసరమైన మరమ్మతులు చేపట్టలేకపోయామన్నారు.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఇంజినీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలు, మండల స్థాయిలో నిర్వహించే రచ్చబండ సమావేశాలలో 42,096 మందికి రేషన్‌కార్డులు, 26,878 మందికి పింఛన్లు, 61,958 కుటుంబాలకు ఇళ్లు, దీపం పథకం కింద మూడు వేల మందికి గ్యాస్ కనె క్షన్లు, బంగారుతల్లి పథకం కింద 1817 మంది లబ్ధిదారులకు మంజూరు ధ్రువపత్రాలు పంపిణి చేయనున్నట్లు వివరించారు. 50 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించిన ఎస్సీ, ఎస్టీల వారికి రూ.10.71 కోట్ల రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ కలలు కార్యక్రమం ప్రతి మండలంలో ఒక కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని, ఒక్కో భవనానికి రూ. 7.50 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో, నకిలీ విత్తనాలతో జరిగిన పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బంగారుతల్లి పథకాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పథకం అమలులో అలసత్వం వహించి, లబ్ధిదారులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడో విడత రచ్చబండ కాార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని కోరారు. డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిసుృన్న రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్, జేసీ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీఓ వీరపాండియన్, ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, రేగా కాంతారావు, సండ్ర వెంకట వీరయ్య, వగ్గెల మిత్రసేన, బాణోత్ చంద్రావతి, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఏజేసీ బాబురావు ,జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.