మాటకు కట్టుబడే నేత..జగన్‌! | Balineni Srinivas Reddy Ravali Jagan Kavali Jagan in Prakasam | Sakshi
Sakshi News home page

మాటకు కట్టుబడే నేత..జగన్‌!

Published Mon, Feb 11 2019 1:16 PM | Last Updated on Mon, Feb 11 2019 1:16 PM

Balineni Srinivas Reddy Ravali Jagan Kavali Jagan in Prakasam - Sakshi

ఒంగోలు నగరం ధారావారితోటలో బాలినేని నవరత్నాల ప్రచారం

ఒంగోలు సిటీ: ‘జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడే నేత..అందరి కష్టాలూ తీరుస్తారు. ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను ఆశీర్వదించాలి’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఆదివారం ఒంగోలు 21వ డివిజన్‌లో యనమల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమానికి బాలినేని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు నేతృత్వంలో ధారావారితోటలో నవరత్నాలకు సంబంధించిన ప్రచారం చేశారు. డివిజన్‌ నాయకుడు యనమల వెంకటేశ్వర్లు, శంకర్, నాగేంద్ర, కె.శివ, డి.మనోజ్, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాజుల కృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై బాలినేని ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని ఆశీర్వదించాలని కోరారు. అవ్వా, తాతలకు రూ.3 వేలపింఛన్‌ ఇస్తామన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధితులకు ఏ చిన్న కష్టం వచ్చినా సొంత అన్నలా అండగా నిలుస్తామని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా రుణాలు రద్దు చేయకుండా కేవలం రూ.10 వేలతో మాయ చేస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్ల నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులను పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కంటితుడుపుగా రూ.250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలు చేసి యాజమాన్యం రూ.వేల కోట్లు ఆస్తులను కూడబెడితే వాటిని నొక్కేందుకు అధికార పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, బాధితులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే తన అనుచరులతో హాయ్‌ల్యాండ్‌లో పార్టీలు చేసుకుంటారని, కానీ దాన్ని అమ్మి బాధితులకు న్యాయం చేయాలని మాత్రం ఎందుకు అడగరని ప్రశ్నించారు. ఎవరు ఎవరి పక్షాన ఉన్నారో గమనించాలన్నారు. వాస్తవంగా ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో గమనించి ఓట్లు వేయాలని బాలినేని కోరారు. అనంతరం తాను చేసిన శాశ్వత అభివృద్ధి పనులు వివరించారు.

పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు
టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల్లో ఉన్నారని బాలినేని విమర్శించారు. ఒంగోలులో కమీషన్ల కోసం అభివృద్ధి మాటున ప్రజల సొమ్ము పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్‌ సాధారణ నిధులు ఖర్చు చేశారని మండిపడ్డారు. రహదారులు, కాలువల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. పెద్ద కాలువల పనులకు నాణ్యతను పాటించకుండా తూతూమంత్రంగా పనులు చేసి ప్రజల సొమ్ము కాజేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను టీడీపీ అనుయాయులకు కట్టబెట్టారని బాలినేని ఆరోపించారు. ఒంగోలులో టీడీపీ అవినీతి చిట్టాకు అంతూపొంతులేదన్నారు. వైఎస్సార్‌ సీపీకి ప్రజలు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని బాలినేని కోరారు. పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు, వైఎస్సార్‌ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ, నాయకులు కటారి శంకర్, కటారి రామచంద్రరావు, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, కటారి లక్ష్మణ, కటారి ప్రసాద్, ఎస్‌కే సుభానీ, కాటా అంజిరెడ్డి, జడా బాలనాగేంద్ర, కరాటే కరిముల్లా, మట్టే రాఘవ, అడపాల రాము, మహిళా నాయకులు గంగాడ సుజాత, పురిణి ప్రభావతి, బి.రమణమ్మ, పల్లా అనూరాధ, బడుగు ఇందిర, బైరెడ్డి అరుణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement