‘ఆడపిల్ల’ పథకమంటే అంత చులకనా..!
విజయనగరం అర్బన్ : ఆడపిల్లల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ పథకం అమలు తీరు అధ్వానంగా తయారైంది. జిల్లాలో ఆది నుంచీ అంతంతమాత్రంగానే అమలవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ పథకం పూర్తిగా మూలకు చేరింది. పథకం పేరును ‘మా ఇంటి మహాలక్ష్మి’గా మార్చుతామన్న ప్రస్తుత ప్రభుత్వం, కనీసం దరఖాస్తులు తీసుకోవడానికి ముందుకురావడం లేదు.
సర్వర్లు పనిచేయకపోవడంతో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. బంగారు తల్లి పథకం కోసం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 12 వేల 103 మంది పేర్లు నమోదు అయ్యాయి. వాటిలో తొలివిడతగా కేవలం 7,020 మంది మాత్రమే నగదును బ్యాంక్ ఖాతాలో జమచేశారు. వీరిలో దాదాపు సగం మందికి ఇంకా బాండ్‌లు రాలేదని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లా వ్యా ప్తంగా 5,083 దరఖాస్తులను స్వీకరించి పెండింగ్‌లో ఉంచారు. నాలుగునెలలు అయినా వాటిపై స్పందన లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2013 మేలో పుట్టిన పాపకు రెండో ఏడాది నిధులు రావా ల్సి ఉంది. అయితే నాలుగునెలలు గడిచినా ఇంకా ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ పథకా న్ని ఉంచుతారోలేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డగోలు నిబంధనలతో అవస్థలు
గతంలో ఏ పథకానికి విధించని నిబంధనలను బంగారు తల్లి పథకానికి అమలు చేస్తుండటంతో ఆడ పిల్లల తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. నిబంధనల ప్రకా రం... ఈ పథకం కోసం తల్లుల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలి. అందుకోసం రెండు గుర్తింపు పత్రాలను బ్యాంక్‌లో అందించాలి. అయితే మహిళల కు పెళ్లికాకముందు ఒక ఇంటి పేరు, పెళ్లి తరువాత మరో ఇంటిపేరు ఉండటంతో వారు బ్యాంక్ ఖాతా ప్రారంభించడం కష్టంగా మారింది. అంతేగాకుండా లబ్ధిదారులు కచ్చితంగా తెల్లరేషన్ కార్డుదారులై ఉండాలి. ఆధార్‌కార్డు కూడా కలిగి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల కాలంలో తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో తెల్లకార్డులేని కారణంగా అర్హులైనవారు కూడా బంగారు తల్లి పథకాన్ని పొందలేకపోతున్నారు.
అన్నీ ఉన్నప్పటికీ ఐకేపీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణం, అదే విధంగా జనన ధ్రువీ కరణపత్రాల మంజూరులోకూడా పలు సమస్యలు ఎదురవుతుండడంతో మరికొంత మంది ఈపథకానికి దూరమవుతున్నారు. ప్రతి ఆడపిల్లకూ బంగారు భవిష్యత్ అం దించాలనే ఉద్దేశ్యంతో గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 2013 జూన్ 19వ తేదీన బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టారు. 2013 మే ఒకటో తేదీ నుంచి జన్మించిన ఆడపిల్లలకు ఈ పథకం వర్తించేలా చర్యలు చేపట్టారు. లబ్ధిదారులు తెల్లకార్డుదారులైన ఉండాలి. ఈ పథకం కింద ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తిచేసేంత వరకూ (21 సంవత్సరాలు వచ్చేంత వరకూ) ఏటా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.
శిశువు పుట్టగానే రూ.2,500 టీకాల నిమిత్తం వెయ్యి రూపాయలు, 1, 2 సంవత్సరాలకు ఏడాదికి వెయ్యి రూపాయలు, 3, 4, 5 సంవత్సరాలకు ఏడాదికి రూ.1,500 అందిస్తారు. బాలికను పాఠశాలకు పంపితే 5వ తరగతి వరకు ప్రతి ఏడాది 2వేల రూపాయలు అందిస్తారు. 6,7,8 తరగతుల్లో ప్రతి ఏడాది రూ.2,500, అదేవిధంగా 9,10 తరగతుల్లో ప్రతి ఏడాది రూ.3 వేలు, ఇంటర్ వరకు చదివిస్తే ఏడాదికి రూ.3,500 అకౌంట్‌లో జమచేస్తారు. ఇంటర్ పూర్తి చేస్తే రూ.50 వేలు, డిగ్రీ పూర్తయిన తరువాత లక్ష రూపాయలు అందిస్తారు.అయితే, చెప్పుకునేందుకు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మత్రం ఆశించిన స్థాయిలో పథకం అమలు జరగడం లేదు.