
కొల్లి ఆనందబాబు(ఫైల్) కొల్లి అరుణ (ఫైల్) కొల్లి చరణ్‌సాయిచంద్(ఫైల్)
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: తన సోదరుడు, అతడి భార్య, కుమారుడితో గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని తణుకుకు చెందిన కొల్లిమధుబాబు శుక్రవారం రాత్రి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం రోడ్డుకం రైలుబ్రిడ్జిపై సోదరుడి సెల్‌ఫోన్, మోటార్ బైక్ ఉన్నాయని కొవ్వూరు పోలీసుల ద్వారా తెలిసిందని ఆయన పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌లోని తులీప్ అపార్టుమెంట్‌లో నివసిస్తున్న కెనరాబ్యాంకు ఉద్యోగి 42 ఏళ్ల కొల్లి ఆనందబాబు, అతడి భార్య 40 ఏళ్ల కొల్లి అరుణ, కుమారుడు, బీటెక్ చదువుతున్న చరణ్‌సాయిచంద్‌ను తీసుకుని గురువారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లారు. రాజమహేంద్రవరం రోడ్డుకం రైలుబ్రిడ్జిపై అర్ధరాత్రి ఆనందబాబు బైకు, సెల్‌ఫోన్, ముగ్గురి చెప్పులు ఉండడంతో అక్కడ చూసిన వారు 100కి కాల్ చేస్తే కొవ్వూరు పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. శుక్రవారం ఉదయం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు.
ఫోన్‌లో నంబర్ ఆధారంగా అతడి సోదరునికి పోలీసులు ఫోన్ చేసి చెప్పడంతో మధుబాబు సంఘటన స్థలంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరుడు ఆనందబాబుకు సుమారు రూ.ఏడులక్షల వరకు అప్పులు ఉండడంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటాడని మధుబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు బొమ్మూరు సబ్‌ఇన్‌స్పెక్టర్ యూవీఎస్ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.