అప్పు తీర్చాలంటూ బ్యాంకు నోటీసులు
లబోదిబో మంటున్న భీమోలు రైతులు
గోపాలపురం : మండలంలోని భీమోలు గ్రామంలో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలను వెంటనే చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేయవద్దని చెప్పకపోవడం దారుణమని రైతులు పేర్కొన్నారు.
ఎస్‌బీఐ తాళ్లపూడి బ్రాంచి నుంచి భీమోలు రైతులు 2011, 2012, 2013 సంవత్సరాలలో పంట రుణాలు తీసుకున్నారు. 15 రోజలలోగా అప్పు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు మాఫీ ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. రుణాలు మాఫీ అవుతాయని ఆశ పడ్డ రైతులకు ఈ నోటీసులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
వెంటనే రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం చులకనవుతుంది
వెంటనే రుణ మాఫీ చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం రైతులు, ప్రజలలో చులకన అవుతుంది. వాగ్దానాల ప్రకారం వ్యవసాయ రుణాలు మాఫీచేసి సన్నచిన్నకారు రైతులను ఆదుకోవాలి.
-వింటి వెంక ట్రావు, రైతు
చంద్రబాబు ప్రచారంతో వడ్డీ భారం పెరిగింది
బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలు తీర్చవద్దని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారంతో బకాయిలు పెరిగేలా చేసి ఇప్పుడు రైతు నడ్డివిరిచేలా వ్యవహరిస్తున్నారు.
-బండారు జగన్‌మోహన్‌రావు, రైతు
రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం
ఆరు నెలల క్రితం అకాల వర్షాలకు పంటలు పోయినా ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. తీసుకున్న అప్పులు తీర్చాలని బ్యాంకు అదికారులు నోలీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రుణమాఫీ పథకాన్ని అమలు చేయకపోతే ఆత్మహత్యలే శర ణ్యం
-బండారు ప్రసాద్, రైతు