విజయనగరం కంటోన్మెంట్: ఈ చిత్రంలో కనిపిస్తున్న వారి పేర్లు మరిడిమాంబ నాయీ బ్రాహ్మణ సహకార సంఘం అధ్యక్షుడు మూగుండు గంగులు, క్షౌర వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి బీవీ దుర్గారావులు. జామి మండలం అన్నం రాజుపేట గ్రామానికి చెందిన మరిడిమాంబ కుల సంఘానికి రూ.6.50లక్షల బ్యాండు మేళం యూనిట్ మంజూరైంది. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేవు. సభ్యులంతా ఇక అభివృద్ధి చెందవచ్చని భావించారు. జిల్లా స్థాయి కమిటీ కూడా ఆమోదించింది.
ఇంకేం..? మరి కొద్ది రోజుల్లో రుణం ఇచ్చేస్తే పరికరాలు కొనుగోలు చేసి బిజినెస్ జరుగుతుందని ఆశపడిన వీరికి బ్యాంకర్లు కొర్రీ వేశారు. రుణం మంజూరుకు నిధులు జమ చేసేందుకు నిబంధనల ప్రకారం ఉండాల్సిన నాన్ ఆపరేటివ్ అకౌంట్‌లను ఇవ్వాల్సి ఉన్నా బ్యాంకర్లు ఇవ్వడం లేదు. పలుమార్లు వీరు బ్యాంకులకు తిరిగినా ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. మరో పక్క ఈనెలాఖరులోగా నాన్‌ఆపరేటివ్ అకౌంట్‌లు ఇవ్వకపోతే మంజూరైన రుణం, సబ్సిడీ వెనక్కు వెళ్లిపోతాయని అధికారులు వీరిని హెచ్చరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక వీరు లబోదిబో మంటున్నారు.
బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా..
ఎన్నికల ముందు బీసీలకు భారీ డిక్లరేషన్ ప్రకటించి రూ.పదివేల కోట్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం వీరికి మొండిచేయి చూపిస్తోంది. డిక్లరేషన్ మాటెందుకు కనీసం మంజూరైన రుణాలను ఇప్పించడంలో కూడా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఉన్న కొద్దిపాటి బీసీ సంఘాలు కూడా నిర్వీర్యమయ్యే ప్రమాదముందని బీసీ కుల సంఘాల నాయకులు వాపోతున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 404 సంఘాలకు గ్రూపు రుణాలివ్వాలని ఇందుకోసం రూ.15.15 కోట్లు లక్ష్యం విధించారు. జన్మభూమి కమిటీల ఆమోదం ఉండాలని చెప్పడంతో కేవలం 98 సంఘాలకు మాత్రమే మంజూరు చేశారు.
ఇందులో 2,689 మంది సభ్యులున్నారు. ఈ సంఘాల్లో 830 మంది సభ్యులున్న 65 సంఘాలకు మాత్రమే నాన్ ఆపరేటివ్ అకౌంట్లిచ్చారు. కానీ జన్మభూమి కమిటీలు ఇక్కడ కూడా తమ జులుం ప్రదర్శించడంతో కొన్ని సంఘాలను ఆపేశారు. కేవలం 600 మంది సభ్యులున్న 47 సంఘాలకు మాత్రమే అకౌంట్లలో సబ్సిడీ వేశారు. మిగతా సంఘాలన్నీ రుణాలకు, సబ్సిడీకి నోచుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా అటు అధికారులు, ఇటు లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గ్యారంటీ తీసుకువస్తే రుణం మంజూరుకు నాన్ ఆపరేటివ్ అకౌంట్ నంబర్లిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈనెలాఖరుకు బ్యాంకుల ద్వారా నాన్ అపరేటివ్ అకౌంట్లిచ్చి సంబంధిత రికార్డులు అందజేస్తేనే రుణాలు మంజూరవుతాయనీ లేకపోతే నిధులు తిరిగి వెళ్లిపోతాయని తెలుసుకున్న లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు.
జిల్లాలో కొన్ని సంఘాలు మాత్రమే ఉన్నాయి
జిల్లాలో మూడు కుల సంఘాలు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. మిగతా సంఘాలు లేవు. ఉన్నవాటికి నిధులు జమ కావాలంటే నాన్‌ఆపరేటివ్ అకౌంట్ నంబర్లుండాలి. అవి లేకపోతే రుణం మంజూరైనా నిధులు జమ అయ్యే పరిస్థితి లేదు. ఈనెలాఖరులోగా ఈ ఖాతాలు తెరిచి ఇవ్వాల్సిందే.
ఆర్వీ నాగరాణి, ఈడీ, బీసీ కార్పొరేషన్ విజయనగరం
బ్యాంకుల కొర్రీ..లబ్ధిదారుల వర్రీ..
Published Thu, May 19 2016 12:26 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement