సహకరించ లేక..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రైతు శ్రేయస్సు కోసం సహకారం అందించాల్సిన వ్యవసాయ పరపతి సంఘాలు చేష్టలుడిగి అచేతనావస్థలోకి వెళ్లిపోయాయి. రైతుకు ఎరువుల విక్రయించడం తప్ప రుణాలు అందించి ఆదుకోలేక నిస్సహాయ స్థితిలో మగ్గుతున్నాయి. వైద్య నాథన్ ప్యాకేజీలు సహకార సంఘాలకు నేరుగా అందకపోవడమే దీనంతటికీ ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో 94 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న వీటిని గాడిలో పెట్టేందుకు వైద్యనాథన్ కమిటీ సిఫారసుతో ప్రత్యేక ప్యాకేజీలను ప్రభుత్వం ప్రకటించింది. వీటి ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవడమే కాకుండా సభ్యులుగా ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు రు ణాలిచ్చి ఆదుకోవాల్సి ఉంది. దీనివల్ల సంఘాలు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తాయని ప్రభుత్వం భావించింది.
అయితే ఆశించిన విధంగా జరగడం లేదు. వైద్యనాథన్ కమిటీ సిఫారసు చేసిన ప్యాకేజీ అంతా డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు)కే పరిమితమైంది. సహకార సంఘాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీ మొత్తాన్ని వాటి ద్వారా తమకు రావాల్సిన అప్పుల కింద డీసీసీబీ జమ చేసేసుకుంది. దాదాపు ఐదు లక్షల మందికి పైగా రైతులు సభ్యులుగా ఉన్నా రుణాలు పొందుతున్న సంఖ్య లక్ష లోపే ఉంటోంది. నిధుల్లేని కారణంగా సంఘాలు దాదాపు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. డీసీసీబీకి సంఘాల పరంగా సుమారు రూ.200కోట్లకు పైగా అప్పులు రావాల్సి ఉంది. సంఘాలికిచ్చిన స్వల్ప కాలిక రుణాల కింద రూ.155కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద మరో రూ.50కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యనాథన్ ప్యాకేజీ కింద వచ్చిన సుమారు రూ.66కోట్లను సంఘాల అప్పుల కింద డీసీసీబీ జమ చేసింది.
ఐడీసీపీ ద్వారా మరో రూ.2కోట్లు వచ్చినా అవి భవన నిర్మాణాలు, గోదాముల అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. ఈ విధంగా సంఘాలు రుణాలివ్వలేని పరిస్థితికి వెళ్లిపోవడంతో ఆ బాధ్యతను డీసీసీబీ తీసుకుంది. దాదాపు 30సంఘాల్లో రైతులకు నేరుగా రుణాలు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో పావలా వడ్డీ, జీరో వడ్డీ కింద రావాల్సిన రాయితీలన్నీ డీసీసీబీకే చేరుతున్నాయి. వైద్యనాథన్ కమిటీ సిఫారసు చేసిన సాయం అందకపోవడంతో సంఘాలు నీరస పడ్డాయి. సహకార అధికారుల చొరవతో ఎరువులు తీసుకొచ్చివిక్రయించడం తప్ప అంతకుమించి మరో పనిలేకుండా పోయింది. ఈ వ్యాపారంలో కూడా మార్జిన్ అంతగా లేకపోవడంతో కాలక్షేపానికే చేస్తున్నట్టుగా ఉంది.
సంఘాల ఇంతటి దయనీయ పరిస్థితిని పాలకులు కూడా పట్టించుకోవడం లేదు. డీసీసీబీ బాగుంటే చాలు మన పనులైపోతాయనే భావనలో ఉంటున్నారు. డీసీసీబీ ద్వారా రుణాలు తీసుకోవడమే కాకుండా నచ్చినోళ్లని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో వేసుకుని లబ్ధిపొందుతున్నారు. అంతేతప్ప గ్రామస్థాయిలో ఉన్న పరపతి సంఘాలను ఆదుకునే దిశగా కనీసం యోచన చేయడం లేదు. డీసీసీబీ అధికారులు చెప్పినట్టుగా వ్యవహరించడమే తప్ప వైద్యనాథన్ ప్యాకేజీల ద్వారా సంఘాలకు పునరుజ్జీవం పోయాలన్న ఆలోచనే నాయకులు చేయడం లేదు. మరి ఈ నేపథ్యలో సహకార సంఘాలు సంక్షోభం నుంచి గట్టెక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే.