
బుధవారం ముసుగు తొలగించిన తరువాత బార్
భవానీపురం(విజయవాడ పశ్చిమం): విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్‌లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ పక్కనే ఉన్న రాగమయి బార్ అండ్ రెస్టారెంట్ ముసుగు తొలగించారు. క్యాంటీన్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వస్తున్నారని అధికారులు ఆ బార్ కనబడకుండా ముసుగు వేయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్యాంటీన్ ప్రారంభించి సుమారు ఒంటి గంట సమయంలో వెళ్లిపోవడంతో బార్ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి ముసుగు తొలగించి యథాతథంగా వ్యాపారం చేసుకున్నారు.
ఈ తంతు చూసిన స్ధానికులు ముక్కున వేలేసుకున్నారు. అయినా తమకు ఆదాయ వనరుగా ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న టీడీపీ ప్రభుత్వం బార్‌లను ఎందుకు మూయిస్తుందని గుసగుసలాడుకున్నారు. కాకపోతే క్యాంటీన్ పక్కనే బార్ ఏమిటని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని అధికారులు ముందు జాగ్రత్తగా మసిపూసి మారేడుకాయ చేశారన్న విమర్శలు వినవచ్చాయి. గతంలో జక్కంపూడిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులే బార్ యాజమాన్యాన్ని హెచ్చరించటంతో ఒక పూట వ్యాపారం పోతేపోయిందని భావించిన బార్ యాజమాన్యం కూడా ముసుగు వేసేసింది.
Comments
Please login to add a commentAdd a comment