
బీసీ విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పిస్తాం
పెద్దాపురం :రాష్ట్రంలో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న బలహీన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన గురువారం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఆ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన ప్రభుత్వ కళాశాలలు, వసతి గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. తమకు హాస్టర్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మంత్రికి తెలిపారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో మాట్లాడి దివిలి కేంద్రంగా కళాశాల హాస్టల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. తొలుత కళాశాల చైర్మన్ బేతినేడి శ్రీనివాసరావు మంత్రి రాజప్పకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి కళాశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి మంత్రి పూలమాల వేశారు. అనంతరం మంత్రి రాజప్పను కళాశాల యాజమాన్యం గజమాలతో ఘనంగా సత్కరించింది. ఏఓ సందీప్, ఈఓ జెన్నిబాబు, దయాకర్, విశ్వేశ్వరరావు, పాల్‌కుమార్, వీరేంద్ర, పెదకాపు, అప్పారావు, సర్పంచ్‌లు కొత్తెం కోటి, మెయిళ్ళ కృష్ణమూర్తి, లక్కరాజు మున్నేశ్వరరావు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.