బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది ఉండదు
బీసీ రుణమేళా సభలో మంత్రి కొల్లు రవీంద్ర
బాబు భరోసా ఇచ్చారని వెల్లడి
సీఎం జ్యోతి ప్రజ్వలనతో రుణమేళా ప్రారంభం
సాక్షి, విజయవాడ బ్యూరో : ఎవరెన్ని చేసినా బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపాడతానని సీఎం భరోసా ఇచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో సీఎం చంద్రబాబు రుణ మేళా ప్రారంభించారు. రుణ మేళాలో ఆటోలు, వీడియో కెమెరాలు, సెంట్రింగ్ యూనిట్, ఎయిర్ కంప్రెషర్, ఆయిల్ ఇంజిన్, కలంకారీ కిట్లు, పడ వలలు, చేపల వలలు, ఇస్త్రీ పెట్టెలు, బార్బర్ కుర్చీలు, మినీ ట్రాక్టర్లు, వడ్రంగి పనిముట్లు, కుండలు చేసే వస్తువులు, వెదురు కళాత్మక వస్తువుల తయారీ యూనిట్లు, జనరిక్ ఔషధాల పంపిణీకి సహాయం వంటి వాటికి రుణాలు అందించారు. సభకు మందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బీసీలు చంద్రబాబు నాయకత్వాన్ని వదలరన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బీసీలకు టీడీపీ తగిన ప్రాధాన్యత ఇస్తుం దని అన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పి.రంగనాయకులు మాట్లాడుతూ బీసీ కులాలను ఆదుకునేలా మరిన్ని కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొచ్చులు అర్జునుడు, టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, నాగుల్‌మీరా మాట్లాడారు. సభలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నగర మేయర్ కొనేరు శ్రీధర్, ఎమ్మెల్యే శ్రీరాం తాతాయ్య, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, ఎ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, మహిళా కార్పొరేషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, బీసీ కార్పొరేషన్ డెరైక్టర్‌లు ఎల్‌ఎల్ నాయుడు పాల్గొన్నారు.