విజయనగరం లోక్‌సభ పరిధిలో బీసీలకు బాబు దగా
వైఎస్సార్‌సీపీ 4 సీట్లు ఇవ్వగా.. 2 సీట్లతో సరిపెట్టిన కూటమి
సింహభాగం బీసీలే ఉన్నా.. పెత్తందారులకే పెద్దపీట
ఒక్క సీటు ఇవ్వలేదని కొప్పుల వెలమల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బీసీలు మా పార్టీకి బ్యాక్ బోన్’ అంటూ వెనుకబడిన తరగతుల వారికి దశాబ్దాలుగా చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇందుకు విజయనగరం లోక్‌సభ నియోజకవర్గమే ప్రత్యక్ష నిదర్శనం. తమకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో కొప్పుల వెలమలు కూటమిపై కత్తులు నూరుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని ప్రెస్‌మీట్లు పెట్టిమరీ హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బీసీ సామాజిక వర్గాలదే అగ్రభాగం.
వాటిలో తూర్పుకాపు, కొప్పుల వెలమ సామాజికవర్గాలు అత్యంత ప్రధానమైనవి. కానీ చంద్రబాబు అత్యంత స్పల్ప సంఖ్యలో ఉన్న పెత్తందారులకే పెత్తనం ఇస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగూ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలే అయినప్పటికీ అక్కడ బీసీ సామాజిక వర్గాలు నిర్ణాయక శక్తిగా ఉన్నాయి.
విజయనగరం జిల్లాలో ఎస్సీ రిజర్వ్‌డ్ రాజాం అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా ఆరు ఎచ్చెర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాలే అధిక శాతం ఉన్నారు. తూర్పుకాపులు రాజాం, ఎచ్చెర్ల, చీపురుపల్లి, నెల్లిమర్లలో, కొప్పుల వెలమలు బొబ్బిలి, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నారు. తమ పార్టీకి బీసీలే వెన్నెముక అంటూ వారిని అవసరానికి ఉపయోగించుకోవడం.. ఎన్నికలు వచ్చేసరికి పెత్తందారులకే పెద్దపీట వేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య.
‘కాపు’లకు ‘కమ్మ’ని దెబ్బ...
టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు ఈ సారి కూడా ఎచ్చెర్ల నుంచే సీటు ఆశించారు. స్థానిక టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. వారిద్దరూ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారే. కానీ చాపకింద నీరులా కమ్మ సామాజికవర్గానికి చెందిన నడికుదుటి ఈశ్వరరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చలువతో ఎచ్చెర్ల సీటు ఎగురేసుకుపోయారు.
ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం వారు పట్టుమని వెయ్యి మంది లేకపోవడం విశేషం. కిమిడి కళావెంకటరావును చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించారు. అక్కడ పదేళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్న ఆయన సొంత సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున రాజకీయ భవిష్యత్తును నాశనం చేయించారు.
సామాజిక న్యాయం హుష్‌కాకి
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తున్న విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం కనిపించలేదు. కొప్పుల వెలమ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ను పట్టుమని వెయ్యి మంది జనాభా కూడా లేని వెలమ (ఓసీ) సామాజికవర్గానికి చెందిన బేబీనాయనకు చంద్రబాబు ఇచ్చారు.
గజపతినగరం టికెట్ కొప్పుల వెలమకు చెందిన మాజీ ఎమ్మెల్యే తెంటు లకు‡్ష్మనాయుడుకి ఇస్తామని అక్కడా మొండిచేయిచూపారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తూర్పుకాపు నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను అక్కడి నుంచి తప్పించేందుకు చీపురుపల్లి టికెట్ ఇస్తామని ఒకసారి, గజపతినగరం సీటు కేటాయిస్తామని మరోసారి చెబుతూ ఆశలపల్లకిలో ఊరేగించారు. తీరా టికెట్ల కేటాయింపు వచ్చేసరికి ఆమెకు ఝలక్ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో పోటీచేయబోనని అశోక్ గజపతిరాజు చేతులెత్తేసిన నేపథ్యంతో తనకు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ వస్తుందని మీసాల గీత ఆశించారు. అయితే గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన అశోక్ కుమార్తె ఆదితికే చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. నెల్లిమర్లలో జనసేనతో పొత్తు ధర్మం పేరుతో బ్రాహ్మణ (ఓసీ) సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి టికెట్ ఇచ్చి అక్కడ తూర్పుకాపులను దెబ్బకొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment