బలహీన వర్గాలకు 34 ఎమ్మెల్యే సీట్లతో సరి
సొంత సామాజిక వర్గానికి 32 సీట్లు
మైనారిటీలకు ద్రోహం.. కేవలం మూడే
కంటి తుడుపుగా బీసీలకు 6ఎంపీ సీట్లు
కాపులకు ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వని వైనం
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలపై మొసలి కన్నీళ్లు కురిపించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. పొత్తులో టీడీపీ పోటీ చేసే 144 అసెంబ్లీ స్థానాలకుగానూ కేవలం 34 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించారు. తన సొంత సామాజిక వర్గానికి మాత్రం ఏకంగా 32 సీట్లు ఇచ్చారు. బీసీలతో సమానంగా కమ్మ సామాజిక వర్గం నేతలు దాదాపు అన్ని జిల్లాల్లో సీట్లు దక్కించుకోవడం గమనార్హం.
ఇక మైనారిటీలకు నామమాత్రంగా మూడు సీట్లతో సరిపెట్టారు. న్యాయంగా వారికి దక్కాల్సిన సీట్లను కూడా పొత్తులో వదిలేయడంతో టీడీపీలోని ముస్లిం నేతలు ఆందోళన చెందుతున్నారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబు కేవలం 9 సీట్లు మాత్రమే వారికి కేటాయించారు. ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నా సీట్లు మాత్రం ఇవ్వలేదు.
ఎంపీ సీట్లలోనూ అదే తీరు..
ఎంపీ సీట్లలోనూ చంద్రబాబు సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. బీసీలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు ఎంపీ సీట్లు ఇవ్వగా తన సొంత సామాజిక వర్గానికీ ఆరు సీట్లు ఇచ్చారు. పొత్తులతో దక్కిన 17 ఎంపీ స్థానాల్లో కాపులకు చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
దీన్నిబట్టి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. తన ప్రసంగాల్లో పేదల గురించి, సామాజిక న్యాయం గురించి డప్పు కొట్టే చంద్రబాబు రాజకీయంగా మాత్రం వారిని అణగదొక్కుతూనే ఉన్నట్లు మరోసారి తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment