చిట్టి ‘తల్లి’
⇒ పద్దెనిమిదేళ్లకు ముందే తల్లులు..
⇒ కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: డిగ్రీలు చేత పట్టుకోవాల్సిన అమ్మాయిలు ఒడిలో శిశువులను ఆడిస్తున్నారు.. వయసుకు ముందే పిల్లల్ని కని జోలపాట పాడుతున్నారు..! అవును.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. ఉభయ రాష్ట్రాల్లో పద్దెనిమిదేళ్ల లోపే తల్లులవుతున్న వారి సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. తాజాగా జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జీఎఫ్‌కే అనే ఓ ప్రైవేటు సంస్థతో చేయించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో.. చిన్న వయసులోనే తల్లులవుతున్న వారు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. రెండో స్థానంలో తెలంగాణ ఉన్నట్టు తేలింది.
తెలంగాణలో ఇదీ పరిస్థితి..
తెలంగాణలో 7,567 మంది గర్భిణులను సర్వే చేయగా అందులో 10.6 శాతం మంది (757 మంది) 18 ఏళ్ల లోపు వయసున్నవారే అని తేలింది. ఇక ఏపీలో 10,428 మంది గర్భిణులను సర్వే చేయగా.. వారిలో 11.8 శాతం(1,230 మంది) 18 లోపు వయసున్న వారని స్పష్టమైంది. రాష్ట్రంలో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల 11 శాతం మంది చిన్నారులు చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్నట్టు నివేదికలో తేలింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ (పాత జిల్లాలు) జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువ కేసులున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో హై రిస్క్ ప్రెగ్నెన్సీ (ప్రసవం సమయంలో ప్రమాదకర పరిస్థితి) ఎక్కువగా ఉంటున్నట్టు తేల్చారు. మాతా శిశు మరణాల విషయంలోనూ ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మారుమూల ప్రాంతాల్లో బాల్య వివాహాలు, వయసుకు ముందే గర్భం దాల్చడంపై అవగాహన కల్పించడం లేదని సర్వేలో తేలింది.
హైదరాబాద్‌లోనూ ఎక్కువే..
దక్షిణాది రాష్ట్రాల నగరాలతో పోలిస్తే.. బెంగుళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో ‘ఎర్లీ ప్రెగ్నెన్సీస్’ (పద్దెనిమిదేళ్లకు ముందే గర్భం దాల్చడం) కేసులు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. హైదరాబాద్‌లో వంద మంది గర్భిణుల్లో ఐదుగురు చిన్న వయసులోనే గర్భం దాల్చినట్టు తేలింది. తెలంగాణ, ఏపీల్లో చిన్న వయసులోనే గర్భం దాల్చుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
చిన్న వయసులో తల్లులు కావడంతో నష్టాలివీ
► నెలలు నిండక ముందే ప్రసవం అయ్యే అవకాశం ఎక్కువ. దీంతో బిడ్డ బ్రతికే అవకాశాలు తక్కువ.
► గర్భిణికి అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ హా నెలలు నిండినా సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సిజేరియన్ ద్వారా బిడ్డను తియ్యాల్సి ఉంటుంది.
► సిజేరియన్ వల్ల తల్లికి భవిష్యత్‌లో దుష్పరిణామాలు ఎదురవుతాయి.
► తల్లికి రక్తస్రావం అయ్యే అవకాశం హా బిడ్డ పోషణకు కావాల్సిన శక్తి తల్లికి లేకపోవడంతో హైపర్ టెన్షన్‌కు గురై, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
అవగాహన లేకపోవడం వల్లే
చిన్న వయసులో గర్భం దాలుస్తున్న ఘటనలు ఎక్కు వగా గ్రామాల్లో జరుగుతు న్నాయి. వారిలో అవగాహన ఉండడం లేదు. గర్భం దాల్చకుండా చాలా రకాల పద్ధతులున్నా వారికి తెలియడం లేదు. చిన్నతనంలో పెళ్లిళ్లు చేయడం కూడా ఇందుకు కారణం అవుతోంది. టీనేజీలో గర్భం దాలిస్తే తల్లికి చాలా ప్రమాదాలున్నాయి.
– డా.ఆండాల్‌రెడ్డి, గైనకాలజిస్ట్,కాంటినెంటల్ ఆసుపత్రి
20 ఏళ్లు దాటితేనే బిడ్డను మోసే శక్తి
సాధారణంగా 20 ఏళ్ల తర్వాత మహిళ గర్భవతి అయితేనే బిడ్డను 9 నెలలు మోసే శక్తి వస్తుంది. అలాంటి శక్తి వచ్చినపుడే బిడ్డకు సరైన పోషకాహారం అందివ్వగలరు. లేదంటే నెలల తక్కువ బిడ్డలు పుడతారు. వారిని బతికించడం చాలా కష్టమవుతుంది.
– డా.వంశీచంద్, చిన్న పిల్లల వైద్య నిపుణులు, రిమ్స్, కడప