
బాప్‌రే....! భిక్ష...అంటే భిక్ష కాదు.. లక్ష!!. కాదు కాదు మూడు లక్షలు...!!. ఈ దృశ్యం చూస్తుంటే మీకేమనిపిస్తోంది..? ఆరుబయట హుండీ డబ్బులు లెక్కిస్తున్నట్లు లేదూ...!. కానీ ఇది ఓ యాచకుడు ‘కష్టపడి’ సంపాదించిన భిక్షను లెక్కిస్తున్న చిత్రం!. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగవారి వీధిలో అప్పల సుబ్రహ్మణ్యం (75) ఒక పాడుబడిన ఇంట్లో ఉంటున్నాడు. అయినవాళ్లు ఆదరణ లేకపోవడంతో యాచకుడిగా మారాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు వచ్చి దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ఇంట్లో సంచులను వెతగ్గా అందులో సుమారు రూ.3 లక్షల వరకూ ఉన్నట్లు గుర్తించారు. కాగా రాజమండ్రిలోని యాచిస్తూ జీవనం గడుపుతూ మరణించిన ఓ వృద్ధ సాధువు జోలె సంచిలో రూ. లక్షా 80 వేల నగదు లభ్యమైన విషయం తెలిసిందే.