అలంపూర్, న్యూస్‌లైన్: ‘మంచి కంపెనీ అని నమ్మి విత్తనాలు వేశాం.. తీరా పంట చేతికందే సమయానికి దాని అసలు రూపం తెలిసింది. విత్తనం వేసి రెండు నెలలు గడిచినా కంకి బయటికి రాలేదు. మరికొంత కాలం ఆగినా ప్రయోజనం కనిపించదు. దీంతో మిమ్మల్ని ఆశ్రయించాం. మీరైనా మాకు న్యాయం చేయండి’ అంటూ మండలంలోని కోనేరు గ్రామరైతులు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలను వేడుకున్నారు. గురువారం ఆ గ్రామాన్ని సందర్శించిన అధికారులకు అన్నదాతలు సమస్యలను ఏకరువు పెట్టారు. కొనేరు గ్రామానికి చెందిన కొందరు రైతులు సీపీ కంపెనీకి చెందిన 818 మొక్కజొన్న రకం విత్తనాలను సాగుచేశారు. రెండునెలలు గడిచినా కంకి రాలేదు. మొక్కలు ఏపుగా పెరిగినా కంకి పడలేదు.
దీంతో కలతచెందిన రైతులు వ్యవసాయశాఖ అధికారులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు గురువారం కరీంనగర్ వ్యవసాయ కేంద్ర శాస్త్రవేత్త మురళీకృష్ణ, జిల్లా డాట్(ఏరువాక) కేంద్ర నిర్వాహక శాస్త్రవేత్త, వ్యవసాయశాఖ డిప్యూ టీ డెరైక్టర్ రఘు రాములు పంటపొలాలను పరిశీలించారు. పంటనష్టపోయిన రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మొక్కజొన్నలు ఏపుగా పెరిగిన కంకులు పడలేదని, పంట సస్యరక్షణ పాటించినా ఫలితం లేదని రైతులు వాపోయారు. పంటశాంపిళ్లను తీసుకెళ్లి వాటిని పరిశీలించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. నివేదిక పరిశీలన తరువాత చర్యలు ఉంటాయని డీడీ తెలిపారు. వారి వెంట ఏడీఏ మహమ్మద్ ఖాద్రీ, ఏఈఓ అనిత, గ్రామరైతులు తదితరులు ఉన్నారు.
300 ఎకరాల్లో పంటనష్టం
కోనేరు గ్రామంలో రైతులకు చెందిన 300 ఎకరాల వరకు మొక్కజొన్న పంట దిగుబడిరాక నష్టం వాటిల్లింది. కొందరు రైతులు ఇతర కంపెనీల విత్తనాలు సాగుచేయగా, మరి కొందరు సీపీ 818, 848 రకం విత్తనాలు వేశా రు. ఇందులో 818 రకం విత్తనాలు వేసిన రైతుల పంటలు రెండు నెలలు గడిచినా ఏపు గా పెరగలేదు. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. సాధారంగా ప్రస్తుతం అనుకూలించిన వాతవరణంతో 25 నుంచి 35 క్విం టాళ్ల పంట దిగుబడి రావాల్సి ఉంది. నాసిరకం విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు.