మహబూబ్‌నగర్ వ్యవసాయం: క్షేత్రస్థాయిలో రైతులకు సహాయ, సహకారాలు అందిస్తూ తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాల్సిన అధికారులు లేక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఉన్నవారిపై పనిభారం ఎక్కువకావడంతో విధులకు న్యాయం చేయలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. మండలాల్లో వ్యవసాయ, విస్తరణ అధికారులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువ య్యారు.
రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు నకిలీవిత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అంటగడుతున్నారు. అంతేకాకుండా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు, పంటనష్టం జరిగిన సమయంలో నివేదికలను తయారుచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా అందించే యంత్ర పరికరాలు, తైవాన్ స్ప్రేయర్స్, స్ప్రింక్లర్లను పొందేందుకు రైతులు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానాఇబ్బందులు పడుతున్నారు.
ఖాళీలు ఇవే..
జిల్లాలో 119 వ్యవసాయాధికారుల పోస్టులకు 78 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా 152 మండల వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) పోస్టులకు 118మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లాలో మరో రెండు సహాయ సంచాలకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 64 మండలాలు ఉండగా, 52 మండలాల్లో మాత్రమే వ్యవసాయాధికారులు ఉన్నారు.
దామరగిద్ద, దౌల్తాబాద్, ధన్వాడ, అయిజ, పెద్దమందడి, ఖిల్లాఘనపూర్, తలకొండపల్లి, నాగర్‌కర్నూల్, బాలానగర్, వెల్దండ, వడ్డేపల్లి, వంగూరు మండలాల్లో పొరుగు మండలాల అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే జిల్లాలోని ఏడీఏ (ఎస్‌సీ)కార్యాలయాల్లో ఐదు, ఏడీఏ(రెగ్యులర్) కార్యాలయాల్లో ఏడు, బీసీఎల్ కార్యాలయాల్లో మూడు, భూసంరక్షణ పరీక్షల కేంద్రాల్లో ఏడుపోస్టులు ఖాళీగా ఉన్నాయి.
భూసారం.. నిస్సారం.. జిల్లాలో సరిపడా ఏఓలు లేకపోవడంతో భూసార పరీక్షకేంద్రాలు మూతపడ్డాయి. గతంలో నారాయణపేట, గద్వాల మార్కెట్‌యార్డుల పరిధిలో భూసార పరీక్ష కేంద్రాలు కొనసాగేవి. అక్కడ పనిచేసే ఏఓలు బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు ఏఓ పోస్టులు కలిగిన కొల్లాపూర్ స్టాటికల్ సాయిల్డ్ టెస్టింగ్ ల్యాబ్‌కు మూడేళ్లుగా ఏఓలు లేక తాళం పడింది.
జడ్చర్లలో ఉన్న జిల్లా ప్రయోగశాలలో మరో రెండు ఏఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇక్కడ అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది 8,500 మట్టినమూనాలకు పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఇప్పటివరకు కేవలం నాలుగువేల మట్టినమూనాలకు మాత్రమే పరీక్షలు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో వ్యవసాయాధికారులు లేక భూసంరక్షణ పరీక్షల విభాగం నిర్వీర్యమవుతోంది.
సిబ్బంది.. ఇబ్బందే
జిల్లాలో 41 మంది వ్యవసాయాధికారులు, 34 ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12 మండలాలకు మండల వ్యవసాయాధికారులు లేక పక్క మండల అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాం.
- భగవత్ స్వరూప్, జేడీఏ
‘సాగు’డెట్లా..?
Published Sun, Jul 6 2014 3:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement