జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న భూత్పూర్ నకిలీ పత్తి విత్తనాల తయారీ, విక్రయానికి కేంద్రంగా మారింది. కొందరు వ్యాపారులు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే విత్తనాలను తయారుచేస్తూ.. అమాయక రైతులకు అంటగడుతున్నారు. ఇక్కడినుంచి గుట్టుచప్పుడుగా కొందరు దళారుల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. తీరా ఈ రంగులద్దిన విత్తును సాగుచేసిన అన్నదాతలు పంటదిగుబడి రాక.. అప్పులబాధ తాళలేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: జిల్లాలోని అనుకూలమైన నేలలు ఉండటంతో ఎ క్కువమంది రైతులు పత్తిని సాగుచేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1.62లక్షల హెక్టార్లలో సాగుచేసినట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నా యి. పెద్దగా నీటిఅవసరం లేకపోవడం, మార్కెట్‌లో ఆశించిన ధరలు లభిస్తుండటంతో ఏటా ఈ వాణిజ్యపంటనే ఎంచుకుంటున్నారు. అన్నదాతల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొం ద రు అక్రమార్కులు ఈ నకిలీ వ్యాపారానికి తె రతీశారు. సాగుకు ఎంతమాత్రం పనికిరాని విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇలా బీ టీపత్తి విత్తన వ్యాపారానికి భూత్పూర్ అడ్డాగా మారింది. ఇక్కడేనుంచే ఏటా కోట్లరూపాయల నకిలీ విత్తనాల వ్యాపారం జరుగుతోం ది. మండల కేంద్రం పరిసరప్రాంతాల్లో ఏకం గా పది కంపెనీలు వెలిశాయి. భూత్పూర్‌లో ఏ డు, అమిస్తాపూర్‌లో మరో మూడు ఉన్నాయి. ఇక్కడ తయారుచేసిన విత్తనాలను గుజరాత్, మహారాష్ట్ర, ఖార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు పార్సిల్ వాహనాల్లో రవాణా చేస్తుంటారు. అలాగే జిల్లాలోని జడ్చర్ల, షాద్‌నగర్ ప్రాంతాల్లో ఈ విత్తనాలను తయారుచేస్తున్నారు.
విత్తనాలు తయారీ ఇలా..
ఈ కంపెనీల్లో రైతుల నుంచి పత్తిని కొనుగోలుచేసిన తరువాత జిన్నింగ్ ద్వారా దూదిని, విత్తనాలను వేరుచేస్తారు. అనంతరం పత్తి విత్తనాలను యాసిడ్ నీటితో కడిగి వీటికి దూదిలేకుండా చేస్తారు. అనంతరం వీటిలో నాపలు, పగిలిన గింజలు లాంటివి లేకుండా చేస్తారు. ఆపై వీటిలో కొద్దిపాటి రసాయనాలను కలిపి ప్యాకెట్లలో ప్యాకింగ్‌చేస్తారు. ఆపై మూడోకంటికి తెలియకుండా రాత్రికిరాత్రే ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. వీటిలో ఎక్కువకంపెనీలు నాపలు, పుచ్చిన, పగిలి విత్తనాలను వేరుచేయకుండా నేరుగా ప్యాకింగ్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
అయితే ఉదయం వేళలో లెసైన్స్‌లు ఉన్న రకాలను ప్యాకింగ్ చేస్తుంటారు. ఈ కంపెనీలు నాన్ బీటీ విత్తన తయారీకి అనుమతులు తీసుకుని వాటి ముసుగులో బీటీవిత్తనాలను తయారుచేస్తున్నారు. భూత్పూర్ మండలం మద్దిగట్లలో గత రెండేళ్ల క్రితం ఓ వ్యాపారి నకిలీ విత్తనాలను విక్రయిస్తూ వ్యవసాయశాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మరోవ్యక్తి కూడా పట్టుబడ్డాడు.
నిబంధనలకు నీళ్లు!
బీటీ విత్తనాలను తయారుచేయాలంటే కచ్చితంగా వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి లెసైన్స్‌లు పొందాల్సి ఉంటుంది. కానీ ఇవే మీ ఇక్కడ జరగడం లేదు. సాధారణంగా విత్తన తయారీసంస్థలు కొన్ని కంపెనీలకు అనుమతులు ఇచ్చి సీడ్స్‌ను తయారుచేయిస్తుంటాయి. ఈ కోవలోనే భూత్పూర్‌లో ఉన్న కొన్ని కంపెనీలు పర్మిషన్ పొందాయి. ప్యాకెట్‌లను తయారుచేసి సదరు కంపెనీకి అప్పగించాలి కానీ ఇక్కడ అనుమతి పేర లక్షలసంఖ్యలో విత్తన ప్యాకెట్లను తయారుచేస్తూ బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. ఈ విధంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా ఎగవేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం.
జేడీఏ కార్యాలయం కన్నుసన్నలోనే..
నకిలీ విత్తనాల తయారీ, వ్యాపారం జేడీఏ కార్యాలయ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గత కొన్నేళ్లుగా పాతుకుపోయిన ఏడీఏ స్థాయి అధికారి ఒకరు కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లాలో జేడీఏలు ఏడాదికి మించి పనిచేయకపోవడంతో సదరు అధికారికి కలిసొచ్చినట్లయింది. ఈయనకు కార్యాలయంలో పనిచేసే మరో అధికారి తోడయ్యాడు. ఇద్దరు ఒకరికొకరు సదరు కంపెనీలకు తమవంతు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూత్పూర్‌లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి ఈ వ్యవహారం గురించి అంతాతెలిసినా పై అధికారుల ఒత్తిడితో మిన్నకున్నట్లు విమర్శలు ఉన్నాయి.
విత్తు.. రైతన్న చిత్తు
Published Mon, May 12 2014 3:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement