కదిరి–రాయచోటి రోడ్‌లో ఉన్న ఓ మద్యం దుకాణం, మద్యం దుకాణం ప్రాంగణంలోనే తాగుతున్న మందుబాబులు
కదిరి నియోజకవర్గంలోని బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా పేరుకు 12 మద్యం దుకాణాలున్నా వాటికి అనుబంధంగా 120 దాకా బెల్టుషాపులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలకు వేలం పాటద్వారా దక్కించుకున్న టీడీపీ నాయకులు తమ బినామీల ద్వారా వాటిని నడుపుతున్నారు. తమ వ్యాపారానికి అడ్డురాకుండా అబ్కారీ అధికారులకు నెల మామూళ్లు ముట్టజెబుతున్నారు. వీటి మూలంగా మందుబాబులు తమ ఇల్లు, ఒళ్లు, గుల్ల చేసుకుంటూ పచ్చని సంసారాలు కూల్చుకుంటున్నారు.
కదిరి: కదిరి పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో ఉన్న మద్యం దుకాణాలన్నీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ తన బినామీల పేరుమీద గత ప్రభుత్వ హయాంలో దక్కించుకున్నారు. ఎంఆర్‌పీని పక్కన బెట్టి అధిక ధరలకు విక్రయించడమే కాకుండా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మందు బాబులు వాపోతున్నారు. మద్యం దుకాణాల వ్యాపారులే కర్ణాటక నుండి చీప్ లిక్కర్ తెప్పించి బెల్టుషాపుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్ రూంలకు అనుమతి లేకున్నా తాగేందుకు అక్కడే ఏర్పాట్లు చేశారు. మద్యం దుకాణాల ద్వారా 40 శాతం విక్రయాలు జరుగుతుంటే మిగిలిన 60 శాతం అమ్మకాలు బెల్టు షాపుల ద్వారానే సాగుతున్నాయని అధికారులే అంగీకరిస్తున్నారు. ఎందుకంటే బెల్టు దుకాణాలకు సమయపాలన లేకుండా రోజంతా అమ్మడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కదిరి పట్టణంలో ప్రతి వీధిలోనూ ఒక బెల్టుషాపు ఉంది. వీటి మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోతున్నారు. అబ్కారీ అధికారులు వారి హోదాను బట్టి నెలసరి మామూళ్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
నిబంధనలు గాలికి
పట్టణంలో ఉన్న బార్‌లోనూ కల్తీ మద్యం, అధిక ధరలకు విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా అక్కడే నిలబడి తాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ గదిని పార్కింగ్ కోసం అంటూ వారి లైసెన్స్ పత్రాల్లో కనబరిచారు. బార్ ముందు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలం లేకపోవడంతో జాతీయ రహదారిపైనే మందుబాబులు తమ ద్విచక్ర వాహనాలను గంటల తరబడి ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గిస్తున్నారు. అబ్కారీ శాఖతో పాటు పోలీస్ శాఖ అధికారులు సైతం దీన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారు.
మొబైల్ అమ్మకాలు
మద్యం దుకాణాల యజమానులు మొబైల్ అమ్మకాలు సైతం సాగిస్తున్నారు. ద్విచక్రవాహనాలతో పాటు ఆటోల్లో మారుమూల గ్రామాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.20 తీసుకుంటున్నారని మందుబాబులు చెబుతున్నారు.
సామాజిక బాధ్యత ఎక్కడ?
నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వారి భరతం పట్టాల్సిన అబ్కారీ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ తమ సామాజిక బాధ్యతను విస్మరించారు. మద్యం తాగడం వలన కలిగే అనర్థాలను ప్రచారం చేయడాన్ని పూర్తిగా పక్కన బెట్టారు. ఏనాడూ ఇలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన పాపాన పోలేదు. తండాల్లో గుడుంబా విక్రేతలపై ఉక్కుపాదం మోపే అబ్కారీ అధికారులు విచ్చల విడిగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మేవారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
విరుద్ధంగావిక్రయిస్తే చర్యలు
బెల్టు షాపులపై పూర్తిగా నిఘా పెట్టాం. మద్యం వ్యాపారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం వ్యాపారుల నుంచి తాము ఎలాంటి మామూళ్లూ తీసుకోవడం లేదు.– కేఆర్ రాజేంద్రప్రసాద్,అబ్కారి సీఐ, కదిరి
Comments
Please login to add a commentAdd a comment