పుష్కర పనుల టెండ‘రింగ్’ | Benami names TDP | Sakshi
Sakshi News home page

పుష్కర పనుల టెండ‘రింగ్’

Published Fri, Jun 17 2016 12:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Benami names TDP

ప్రజారోగ్యశాఖలో రూ.21.71 కోట్లతో టెండర్లు
బినామీ పేర్లతో టీడీపీ  ప్రజాప్రతినిధుల  మాయాజాలం
చక్రం తిప్పిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, బ్రోకర్
అధికారి చాంబర్లోనే  బేరసారాలు

 

కృష్ణా పుష్కరాల్లో పారిశుధ్య పనులకు టీడీపీ ప్రజాప్రతినిధులు టెండ ‘రింగ్’ పెట్టారు. రూ.21.71 కోట్ల రూపాయల పనుల్ని బినామీ పేర్లతో ఎగరేసు పోయేందుకు పక్కా స్కెచ్ వేశారు.  బయటి కాంట్రాక్టర్లకు చాన్స్ ఇవ్వకుండా రింగ్ చేశారు.ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, ఒక బ్రోకర్ చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ముఖ్య అధికారి వారి కనుసన్నల్లో పాలన సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

విజయవాడ సెంట్రల్ : పుష్కర పనులు టీడీపీ ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధికార దర్పంతో అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, ఒక బ్రోకర్ కలిసి ప్రజారోగ్య శాఖలో దందా చలాయిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోట్ల విలువైన టెండర్లను బినామీ పేర్లతో దక్కించుకున్నారని సమాచారం. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పకడ్బందీగా శానిటేషన్ పనుల్ని చేపట్టేందుకు ప్రజారోగ్య శాఖ కు రూ.21.70 కోట్లు కేటాయించారు. ఫినాయిల్, కర్రలు, చీపుర్లు, మందులు కొనుగోలు చేయడంతోపాటు 15 వేల మంది తాత్కాలిక సిబ్బంది నియామకం, మలేరియా నివారణ చర్యలు, కోతులు, కుక్కలు, పందుల్ని పట్టడం తదితర పనులు చేపట్టాలని నిర్ణయించారు. 61 ప్యాకేజీలుగా విభజించి  ఈ మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన టెండర్లు పిలిచారు. 37 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలయ్యాయి. పదో తేదీన వీటిని పరిశీలించిన ప్రజారోగ్యశాఖ అధికారులు తుది ఆమోదం కోసం కమిషనర్ టేబుల్‌పైకి పంపారు.

 
టెండ‘రింగ్’

టెండర్లను దక్కించుకొనేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు బ్రోకర్‌తో కలిసి హైడ్రామా నడిపారు. టెండర్ల నిర్వహణకు సంబంధించి ప్రజారోగ్యశాఖ అధికారి ముందుగా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. అందులో 80 శాతం మంది బ్రోకర్ మనుషులే అని తెలుస్తోంది. టెండర్లు దాఖలు చేసే సమయంలో సైతం బ్రోకర్ హల్‌చల్ చేశాడని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. టెండర్లు వేయకుండా తమను అడ్డుకున్నారని, తమ మాట విన్న వారిని రింగ్ చేసి టెండర్లు దాఖలు చేయించారని బాధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. గతంలో బ్రోకర్ ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో హవా చలాయించేవాడని, అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళ వద్ద రూ.10 వేలు వసూలు చేయడంపై వివాదమూ ఉందని తెలిసింది. ఈ ఘటన తరువాత ఎంపీ దూరంగా పెట్టడంతో ఇద్దరు మహిళా కార్పొరేటర్లతో కలిసి ప్రజారోగ్య శాఖలో దందా చలాయిస్తున్నట్లు సమాచారం. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల డివిజన్ల మార్పులు, చేర్పులతో భారీ డీల్స్ చేస్తున్నాడని భోగట్టా. ముఖ్య అధికారి చాంబర్లో మహిళా కార్పొరేటర్లతో కలిసి తిష్ట వేసి బేరసారాలు సాగించడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా  మారింది. వీరితో అధికారి సుదీర్ఘ సమావేశం కారణంగా వివిధ పనులపై లోనికి వెళ్లలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారి బర్త్‌డే వేడుకల్ని ఇటీవల బ్రోకర్ ఘనంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

 

 
లెస్ టెండర్ల మాయాజాలం

పుష్కరాల్లో పారిశుధ్య విధులు నిర్వహించేందుకు 15 వేల మంది తాత్కాలిక కార్మికుల్ని నియమించాలని నిర్ణయించారు. వీరికి రోజుకు రూ.425 చొప్పున ఇచ్చే విధంగా టెండర్లో అధికారులు పొందుపరిచారు. రింగ్ అయిన కాంట్రాక్టర్లు రూ.403 నుంచి  రూ.424 వరకు ధరను కోట్ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. లెస్ టెండర్లుగా బయటకు కనిపిస్తున్న వీటి వెనుక పెద్ద మాయాజాలమే దాగుంది. ప్రజారోగ్య శాఖలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రోజుకు రూ.365 చొప్పున చెల్లిస్తున్నారు. తాత్కాలిక కార్మికులకు మాత్రం రూ.425 ధర నిర్ణయించారు. ఇందుకు ఒక రూపాయి అటు ఇటుగా టెండర్లను ఓకే చేస్తారు. తాత్కాలిక కార్మికులకు కాంట్రాక్టర్ నిర్ణయించిన ధర మాత్రమే చెల్లిస్తాడు. అదనపు ధర కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే అన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం 7,500 మంది కార్మికుల్ని సరఫరా చేసేందుకు టీడీపీ అండ్ కో టెండరేసింది. ఇవి ఓకే అయితే భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. ప్రజారోగ్యశాఖలో అవినీతి కంపుపై కమిషనర్ దృష్టి సారిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశముంది.

 

బయటి విషయాలు అనవసరం
పుష్కర పనులకు సంబంధించి లెస్ టెండర్లే వచ్చాయి. కాంట్రాక్టర్లు రింగ్ అయిన విషయం నాకు తెలియదు. బయట జరిగే విషయాలు నాకు అనవసరం. మొత్తం 61 ప్యాకేజీల్లో 19 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలు కాలేదు.

మరోసారి పిలిచాం.  గోదావరి పుష్కరాల్లో అప్‌సెట్ వ్యాల్యూ ఆధారంగానే టెండర్లు పిలిచాం. ప్రస్తుతం కమిషనర్ పరిశీలనలో ఉన్నాయి.     - ఎం.గోపీనాయక్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, నగరపాలక సంస్థ

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement