చెముడు సహకార సొసైటీలో రూ. 97.74లక్షల మేరకు అవకతవకలు జరిగాయి. ఇందులో బినామీ రుణాలే ఎక్కువగా ఉన్నాయి. కొందరికైతే రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపించి మింగేశారు. మరికొందరికి తక్కువ మొత్తాల్లో రుణాలు మంజూరు చేసి రికార్డుల్లో ఎక్కువగా చూపించారు. ఇది ఏడాది క్రితమే వెలుగు చూసింది. కానీ రికవరీకి చర్యలు తీసుకోవడం లేదు. శాఖా పరమైన చర్యలంటూ తాత్సారం చేస్తున్నారు. క్రిమినల్ చర్యలకు పోవడం లేదు.
గొట్లాం పీఏసీఎస్‌లో 1559మందికి సుమారు రూ.కోటి 3 లక్షలు బోగస్ రుణాల కింద అక్రమాలు జరిగినట్టు రెండేళ్ల క్రితమే తేల్చారు. కానీ ఇంతవరకు రికవరీకి చర్యలు తీసుకోలేదు. ఎందుకిలా చేస్తున్నారంటే ఆ రెండు సొసైటీలకూ అధికార పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నందునే. అందుకే వాటి జోలికి పోవడం లేదు. కేసులపై శ్రద్ధ చూపడంలేదు. శాఖా పరమైన ప్రక్రియ పేరుతో తాత్సారం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని పీఏసీఎస్‌ల్లో అక్రమాలు జరిగితే అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో ఒక్కోచోట ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. వారి దృష్టి అంతా ఎంతసేపూ టీడీపీ ప్రత్యర్థుల సొసైటీలపైనే. అధికార పార్టీ ప్రాతినిధ్యం వహిస్తే చర్యలకు వెనుకాడుతున్నారు. విషయం గ్రహించిన ఉన్నతాధికారులు కాసింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో అక్రమాలు తేలినా రికవరీలోనూ... పోలీసు కేసులు పెట్టడంలోనూ అనుసరిస్తున్న వైఖరిపైనా ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. తాజాగా చెముడు సొసైటీలో రూ. 97.74లక్షలు అక్రమాలు తేలినా పోలీసు కేసు పెట్టడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని జిల్లా సహకార అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నించారు. తక్షణమే కలెక్టర్‌కు పెట్టి చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు.
సొసైటీలో అక్రమాలు సర్వసాధారణమే...
బినామీ రుణాలు, నిధుల దుర్వినియోగం సహకార సంఘాల్లో కొత్తేమీ కాదు. సెక్షన్ 51స్టాట్యుటరీ విచారణ, సెక్షన్ 52, 53పై విచారణలు అనేకం జరిగాయి. ఇటీవల కాలంలో 25 సహకార సంఘాల్లో బినామీల పేరుతో రుణాలు కాజేయడం, నిధుల దుర్వినియోగం, కొనుగోళ్లలో చేతివాటం వంటి అడ్డగోలు కార్యకలాపాలు జరిగినట్టు తేలింది.ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నవి పక్కన పెడితే 51స్టాట్యూటరీ విచారణ 17సొసైటీల్లో జరిగింది. రూ. 2.5కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు తేలింది. ఇందులో ఒక్క చెము డు సొసైటీలోనే రూ. 97.74లక్షల అవినీతి చోటు చేసుకుంది. అక్రమాలు, విచారణ జరిగి ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రికవరీ జరగడం లేదు.
అలాగే 52స్టాట్యూటరీ విచారణ ఏడు సొసైటీల్లో జరిగింది. ఇందులోనూ రూ. లక్షల్లో అవినీతి బయటికొచ్చింది. సెక్షన్ 53 ప్రకారం గొట్లాం పీఏసీఎస్‌లో విచారణ నిర్వహించి అక్రమాల్ని వెలికి తీశా రు. ఇందులో రూ.కోటి 3లక్షల మేర అక్రమాలు జరిగాయి. ఈ అవినీతికి చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులే కారణమని అధికారులు తేల్చారు. కానీ బతికున్న సొసైటీ డెరైక్టర్లు, అందులో పనిచేసిన ఇతర సిబ్బందిని వదిలేశారు. వాస్తవానికైతే ఈ సొసైటీలో 51స్టాట్యుటరీ విచారణ జరపాలి. ఈ విచారణ జరిగితేనే చట్టబద్ధత ఉంటుంది. బ యటి వ్యక్తులు విచారణ చేపట్టడం ద్వారా మరింతగా అక్రమాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ రకమైన విచారణ జరగలేదు.
అధికారుల తీరుపైనే అనుమానాలు
న్యాయపరమైన ఇబ్బందులున్న వాటిని పక్కన పెడితే మిగిలిన చోట అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ సొసైటీల్లో అక్రమాలు జరిగినట్టు తేలినా వాటి జోలికెళ్లడం లేదు. చెముడు సొసైటీపై సీబీసీఐడీ విచారణ జరపాలని ఇక్కడ విచారణ జరిపిన అధికారి సిఫార్సు చేశారు. అక్రమాలు రూ. కోటి దాటలేదన్న కారణంగా సీబీసీఐడీ విచారణకు తిరస్కరించారు. కనీసం పోలీసు స్టేషన్‌లోనైనా కేసు పెట్టలేదు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అక్రమాలు ఇలా...
కొన్ని సొసైటీల్లో భూమి లేని వారిని సభ్యులుగా చేర్చి వారి పేరున రుణాలు తీసుకుని పాలక వర్గ సభ్యులు మింగేశారు.
కొన్నిచోట్ల కొందర్ని కౌలు రైతులుగా చేర్పించి, వారి పేరునా, వారికి తెలియకుండా రుణాలు కాజేశారు.
కొన్ని సొసైటీల్లో షేర్ కేపిటల్‌కు సంబంధం లేకుండా రుణాలిిప్పించేసి కుట్ర పూరితంగా నిధులు దుర్వినియోగం చేశారు. సొసైటీలో సభ్యుడిగా చేరితే రూ.300షేర్ కేపిటల్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆ మేరకే రుణ పరిమితి నిర్దేశిస్తారు. చాలా సొసైటీల్లో అడ్డగోలుగా రుణాలు ఇచ్చేసినట్టు తెలిసింది.
కొన్ని సొసైటీల్లో సభ్యుడికి తెలియకుండా సభ్యత్వం చేర్పించి, వారి పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి రుణాలు తీసేసుకున్నారు.
పాలకపక్షమా... ఐతే ఓకే!
Published Sun, Feb 7 2016 3:46 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement