
విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత ఉపశమనం లభించనుంది.
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ అక్కరకు రానుంది. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌పై సోమవారం నుంచి ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. నెల రోజుల క్రితమే దీని నిర్మాణం పూర్తయింది. అయితే, ఫ్లైఓవర్ ప్రారంభానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రావాల్సి ఉంది. ఆయన రాష్ట్రానికి వచ్చే తేదీపై స్పష్టత లేకపోవడంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఈ ఫ్లైఓవర్‌పై ప్రయోగాత్మకంగా వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు.
కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ ఆదివారం ‘సాక్షి’కి చెప్పారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్‌ను సందర్శించనున్నారు. నితిన్ గడ్కరీ రాక తేదీ ఖరారయ్యాక అధికారికంగా ఆయనతో ప్రారంభోత్సవం చేయించనున్నారు. (చదవండి: ఇసుక.. ఇంటికే వచ్చేస్తుందిక)