
బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌పై ట్రయల్ రన్ సందర్భంగా వాహనాల రాకపోకలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ బెంజి సర్కిల్ వద్ద నిర్మించిన రెండో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీంతో అధికారులు శనివారం ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాలను వదిలి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. రామవరప్పాడు వైపు వెళ్లే వాహనాలు స్క్రూబ్రిడ్జి వద్ద ఫ్లైఓవర్‌పైకి వెళ్లి వినాయక థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపైకి దిగుతాయి.
బెంజి సర్కిల్‌తోపాటు నిర్మలా కాన్వెంట్ జంక్షన్, రమేష్ ఆస్పత్రి జంక్షన్‌లను కలుపుతూ రూ.90 కోట్ల ఖర్చుతో రెండో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మొదటి ఫ్లైఓవర్ కంటే రెండో ఫ్లైఓవర్ ఏడాదిలోపే నిర్మాణ పనులను పూర్తి చేసుకోవడం విశేషం. మొదటి ఫ్లైఓవర్ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నాలుగేళ్లకు కానీ పూర్తి కాలేదు. కాగా, ప్రస్తుతం బెంజి సర్కిల్, నిర్మలా కాన్వెంట్, రమేష్ ఆస్పత్రి జంక్షన్‌ల వద్ద ఓవైపే ఫ్లైఓవర్ ఉండటంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం రెండో ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.