భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జనవరి 11న జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో సామాన్య భక్తులు సైతం ప్రశాంతంగా, నయనానందకరంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం.రఘునాథ్ తెలిపారు. సోమవారం ఆయన ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో విలేకరులతో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి రోజు న వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధ్యయనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూల అలంకరణకు, వైదిక పనుల నిర్వహణ, ఇతర ఖర్చుల నిమిత్తం దేవస్థానం నుంచి రూ.32 లక్షలు కెటాయిస్తున్నట్లు తెలిపారు.
వీటితో పాటు గ్రామపంచాయతీ తరఫున మరో రూ.10 లక్షలు విడుదల చేయనున్నారని వివరించారు. తెప్పోత్సవం, ముక్కో టి ఏకాదశికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, ఇందుకు తగ్గట్టుగా 3 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. భక్తులు లడ్డూల కోసం ఇబ్బంది పడకుండా ఆలయ ప్రాకారం ఎదురుగా క్యూలైన్ల వద్ద 5 లడ్డూలు రూ.50కి విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెప్పోత్సవానికి వినియోగించే లాంచీ హంసాలంకరణను జనవరి 5, 6 నాటికి సిద్ధం చేసి ట్రయల్ రన్ చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారన్నారు. గతేడాది జరిగిన లోటుపాట్లను సరిచేసుకొని ఈ ఏడాది ఉత్సవాల విజయవంతానికి కృషి చేస్తామని, అందుకు కావల్సిన సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.
అధ్యయనోత్సవాలకు ‘సురభి’ శోభ...
అధ్యయనోత్సవాలలో భాగంగా జరిగే పగల్‌పత్తు ఉత్సవాలలో సురభి కంపెనీ వారిచే ప్రఖ్యాత నాటకాల ప్రదర్శనకు ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. మిథిలా స్టేడియం వద్ద జనవరి 1, 10 తేదీలలో మాయాబజార్, 2న శ్రీవీరబ్రహ్మంగారి చరిత్ర, 3న సతీ అనసూయ, 4న భక్తప్రహ్లాద, 5, 8 తేదీలలో జైపాతాళ భైరవి, 6న బాలనాగమ్మ, 7న లవకుశ, 9న శ్రీకృష్ణలీలలు నాటకాలు ఉంటాయని వివరించారు. వీటితో పాటు స్థానిక కళాకారులచే సాంసృ్కతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.
జనవరి 5 నుంచి రూ.500 టికెట్ల విక్రయం...
వైకుంఠ ద్వార దర్శనానికి రూ.800 విలువ గల వీఐపీ టికెట్లు 600, రూ.500 టిక్కెట్లు 2580, రూ250.టికెట్లు 650 సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో వీఐపి టిక్కెట్లను ఆర్‌డీవో ఆధ్వర్యంలో అమ్మనున్నారని, రూ 500, 250 విలువైన టికెట్లు జనవరి 5న దేవస్థాన కార్యాలయంలో అమ్మకానికి పెట్టనున్నట్లు చెప్పారు. 7 నుంచి కల్యాణ మండపం, ఇతర ప్రదేశాలలో టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయానికి నిక్ సంస్థ ఆధ్వర్యంలో ఎండోమెంట్ శాఖ చేపట్టిన టెక్నికల్ సేవలు వచ్చే శ్రీరామనవమి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. సమావేశంలో ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్, ఏఈ రవీందర్, అర్చకులు విజయ రాఘవన్, శ్రీమన్నారాయణాచార్యులు పాల్గొన్నారు.
భక్తులందరికీ ప్రశాంత దర్శనం
Published Tue, Dec 31 2013 6:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement