ముస్తాబైన భద్రాద్రి
భద్రాచలం, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవాలకు శ్రీరామ దివ్య క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. శనివారం తెల్లవారుఝామున ఉత్తరద్వారంలో స్వామివారు దర్శనమిస్తారు. భూలోక వైకుంఠంగా పేరొందిన భద్రాచలంలో ఉత్తరద్వారంలో దర్శనమిచ్చే శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కనులారా తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తులు ప్రగాఢవిశ్వాసం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెప్పోత్సవం జరిగే గోదావరి స్నానఘట్టాల రేవు పరిసరాలను శుభ్రం చేశారు. ఉత్సవాన్ని తిలకించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గోదావరి ఘాట్‌లో సెక్టార్‌లను ఏర్పాటు చేసి బారీకేడ్‌లను అమర్చారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు స్వామివారు ఆలయం నుంచి ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా గోదావరి తీరానికి బయలుదేరుతారు. హంసవాహనం మాదిరి తయారు చేసిన లాంచీపై స్వామివారు కొలువుదీరి నదిలో విహరిస్తారు.
రేపు వైకుంఠ ద్వార దర్శనం..
ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున శ్రీ సీతారామచంద్రస్వామివారు ఉత్తరద్వారంలో దర్శనమిస్తారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారు ఇలా ఉత్తరద్వారానికి వేంచేస్తారు. వైకుంఠద్వారంగా పిలిచే ఈ ఉత్తరద్వారంలో స్వామివారిని తిలకిస్తే మోక్షం లభిస్తుందని ప్రతీతి. ఉత్తరద్వారంలో స్వామివారిని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం వారు టిక్కెట్‌లు విక్రయిస్తున్నారు. ఉత్తర ద్వారం ముందు భాగాన్ని వీవీఐపీ, వీఐపీ, ఇతర సెక్టార్‌లుగా విభజించి టిక్కెట్లు విక్రయిస్తున్నారు. వీవీఐపీ టిక్కెట్లు కేవలం ఆర్‌డీవో ద్వారానే విక్రయిస్తున్నారు. మిగతా టిక్కెట్లను బ్యాంకులతో పాటు దేవస్థానంలోని ప్రత్యేక కౌంటర్‌లలోనూ ఇస్తున్నారు.
ముక్కోటి విశిష్టత
ముక్కోటి దేవతలు వైకుంఠంలో శ్రీమన్నారాయణుని పూజించే రోజే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఆశాఢ శుద్ధ ఏకాదశి నుంచి జగద్రక్షణ చింతనయను యోగ నిద్ర లో ఉన్న శ్రీ మహావిష్ణువు మరలా కార్తీకశుద్ధ ఏకాదశి నాడు మేల్కొని బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చే రోజే ముక్కోటి ఏకాదశి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి మోక్షం ప్రసాదించుట చేత ఈ ఏకాదశికి మోక్షదా ఏకాదశి అని కూడా పేరు. ఎంతో పవిత్రమైన ఈ రోజున (శనివారం) ఉత్తరద్వారంలో గరుడ వాహనంపై వేంచేసి ఉన్న శ్రీ మహావిష్ణువును ఎవరైతే సేవిస్తారో వారికి భగవాదానుగ్రహం, మోక్షం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.