కడువైభవం.. భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం
ఇదిగాక సంతోషం ఉందా.. ఇదిగాక ఆనందం ఉదా.. అంటూ భక్తులు పరవశంతో ఉప్పొంగినవేళ.. శ్రీ సీతారామచంద్రస్వామిస్వామివారు గోదావరిలో ఆనంద విహారం చేశారు. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పొద్దుపోయిన తర్వాత అర్చకులు నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది.
ఉదయం యాగశాలలో చతుస్థానార్చన, హోమాలు జరిగాయి. సాయంత్రం ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారిని పల్లకిపై ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకెళ్లారు. మేళతాళాలు, కోలాటాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామివారు గోదావరి నదికి వెళ్లారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఉంచి దొంగల దోపు ఉత్సవం నిర్వహించారు.
గోదావరి నదిలో విహరిస్తున్న స్వామివారి నగలను ఒక దొంగ ఎత్తుకుపోవటం, ఆ తరువాత అతడు పరివర్తన చెంది రామునికి పరమభక్తునిగా మారుతాడు. దీనిని గుర్తుచేస్తూ తిరుమంగైళ్వార్ చరిత్రను మననం చేసుకునే క్రమంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ తంతు నిర్వహించటం ఆనవాయితీ. తిరుమంగై ఆళ్వార్, రాజుల వేషధారణలో ఆలయ సిబ్బంది నటించి ఉత్సవాన్ని రక్తి కట్టించారు. ఈ ఉత్సవం తరువాత స్వామివారిని అశ్వవాహనంపై కొలువు తీర్చి తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.