పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తజనం
తెల్లవారుజాము 3 గంటల నుంచే స్నానాలు
కృష్ణానదిలో నీరు లేక జల్లు స్నానాలతో సరి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మహా శివరాత్రి పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానది తీరంలోని పద్మావతి, సీతమ్మ వారి పాదాలు, దుర్గ, భవానీపురం, పున్నమి ఘాట్‌లకు భారీగా తరలివచ్చారు. నదిలో నీటి మట్టం పడిపోవడంతో భక్తులందరూ జల్లు స్నానాలతో సరిపెట్టారు. పుణ్యస్నానాల కోసం దుర్గాఘాట్‌కు చేరుకున్న భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దుర్గాఘాట్ నీరు పూర్తిగా మురికిగా మారింది. మోటారుతో నీరు తోడించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు సమీపంలోని పాత శివాలయం, అశోక స్థూపం సమీపంలోని విజయేశ్వరాలయం, ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని పూజించారు.
విశేష అలంకరణ
మహా శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయాలను విశేషంగా అలంకరించారు. పెళ్లి కుమార్తె దుర్గమ్మను, అంతరాలయ ప్రాంగణాన్ని సప్తవర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మరో వైపున మల్లేశ్వరాలయాన్ని బంతి, జిల్లేడు పూలతో అలంకరించారు. ఆది దంపతుల కల్యాణోత్సవానికి ముస్తాబైన ఇంద్రకీలాద్రిపై ఎక్కడ చూసినా పచ్చటి మామిడి తోరణాలు, అరటిచెట్లు స్వాగతం పలికాయి.
భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
మహా శివరాత్రి మహోత్సవాలను పురష్కరించుకుని ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా పెళ్లి కుమార్తెగా ముస్తాబైన దుర్గమ్మను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనం శివ నామస్మరణతో వచ్చారు. భక్తుల క్యూలైన్ పాత అన్నదాన భవనం వరకు చేరింది.
దుర్గగుడి ఈవో అప్రమత్తం
కృష్ణలంక సీతమ్మవారి పాదాల ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసేందుకు దేవస్థానం షవర్లు ఏర్పాటు చేసింది. అయితే కొంత మంది భక్తులు ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఐరన్ మెస్ తొలగించి నదిలో స్నానాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఊబి, ప్రమాదకరమైన గుంతలు ఉంటాయని తెలుసుకున్న దుర్గగుడి ఈవో నర్సింగరావు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఐరన్ మెస్ తిరిగి ఏర్పాటుచేయించారు. అనంతరం జిల్లా అధికారులు, పోలీసు శాఖకు సమాచారం ఇచ్చారు. సుమారు రెండు గంటలపాటు ఈవో నర్సింగరావు, ఏఈవో వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ ఎన్.రమేష్ నదివద్దే ఉండి భక్తులు నీటిలోకి దిగకుండా చర్యలు తీసుకున్నారు.