మాట్లాడుతున్న డిప్యూటీ కమిషనర్, చైర్మన్
మహాశివరాత్రికి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
Published Tue, Feb 14 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM
– మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్
మహానంది: మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం దేవస్థానం కార్యాలయంలో పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్ఠాత్మకమైన లింగోద్భవ కార్యక్రమంలో గత ఏడాది ఈఓ, పాలకమండలి సభ్యులకు సైతం చోటు లేకపోయిందని, ఈ ఏడాది దేవస్థానం పరిధిలో తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామన్నారు.
వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో గాకుండా కేవలం దంపతులు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అందులో భాగంగా ఈ ఏడాది రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారికి నూతనంగా పుష్పపల్లకీ సేవ నిర్వహించనున్నట్లు చెప్పారు. మహానంది దేవస్థానంలో రూ.74లక్షలతో గ్రానైట్ పనులు చేపడుతున్నామన్నారు. రూ.16లక్షలతో శాండ్‌బ్లాస్టింగ్, బండపరుపు పనులు జరుగుతున్నాయన్నారు. ఉత్సవాలకు రూ.15.73లక్షలు మంజూరైందని, అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.
కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణానికి నంద్యాలకు చెందిన కూరగాయల వ్యాపారి లక్కబోయిన ప్రసాద్ దంపతులు దాతలుగా వ్యహరిస్తున్నారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఉన్న శాశ్వత లైన్లతో పాటు తాత్కాలిక లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పార్కింగ్ నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. వీటి కోసం నంద్యాలకు చెందిన రామకృష్ణ, ప్రభాత్, శాంతిరాం విద్యా సంస్థలు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయన్నారు.
టెంకాయలు సమర్పించే చోట, చెప్పుల స్టాండు వద్ద భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవస్థానం పాలకమండలి ధర్మకర్త సీతారామయ్య ఆధ్వర్యంలో తాగునీరు సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు బాలరాజుయాదవ్, రామకృష్ణ, మునెయ్య, చింతకుంట్ల శివారెడ్డి, బండి శ్రీనివాసులు, సీతారామయ్య, మౌళీశ్వరరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement