మహానందమాయే!
-
కనుల పండువగా సాగిన మహానందీశ్వరుడి రథోత్సవం
-
మహానందిలో కనులపండువగా జరిగిన రథోత్సవం
-
అశేష భక్తజనవాహిని మధ్య కదిలిన రథం
మహానంది: నల్లమల పర్వత పాన్పుల అందాలు.. నీలాకాశం నింగి అందాలకు తోడుగా మహానందీశ్వరుడి రథోత్సవం కనులపండువ సాగింది. మహానంది దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో ఆదివారం సాయంత్రం రథోత్సవం వైభవంగా సాగింది. కర్నూలు అడిషనల్ జడ్జి ఇంతియాజ్ అహ్మద్, నంద్యాల ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్‌రావు, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్, నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, కల్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు రథోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణం పూర్తయిన తర్వాత ఆదివారం పెళ్లిపెద్దలు శ్రీ పార్వతీ సహిత శ్రీ బ్రహ్మనందీశ్వరస్వామితో కలిసి రథంలో కొలువయ్యారు. ఈ మేరకు లక్షలాది మంది భక్తులు హరహర...మహాదేవ...శంభో శంకర.....శ్రీ మహానందీశ్వరస్వామికి జై...శ్రీ కామేశ్వరీదేవి మాతాకీ జై....అంటూ భక్తులు భక్తిపూర్వకంగా ప్రణమిల్లారు. ఆలయం పురవీధుల్లో సాగిన ర థోత్సవాన్ని తిలకించిన భక్తులు మహానందానికి గురయ్యారు.
రథోత్సవంలో విశేష పూజలు:
రథోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం రథం వద్ద వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ, తదితర çపండిత బృందం ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, రథాంగబలి, నవకలశ స్నపనము, రథాంగహోమము, దీక్షా హోమం, తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం తిమ్మాపురం గ్రామానికి చెందిన పుల్లయ్యాచారి కుంభంకూడు మోసుకొచ్చారు. రథానికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తెడ్లకు కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేపట్టారు.
రథంలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా, ప్రదక్షిణలు చేయడం ద్వారా పునర్జన్మ ఉండదని, సర్వ పాపాలు హరిస్తాయని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. తూర్పున ధర్మం, పడమట జ్ఞానం, ఉత్తరాన ఐశ్వర్యం, దక్షిణాన మోక్షం లభిస్తుందన్నారు. రథంలో బ్రహ్మ, అనంతుడు, ఇంద్ర, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఉంటారని వారు వివరించారు. పూజా కార్యక్రమాల్లో పాలకమండలి సభ్యులు బండి శ్రీనివాసులు, రామకృష్ణ, సీతారామయ్య, మునెయ్య, బాలరాజు, శివారెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సురేంద్రనా«ద్‌రెడ్డి, నంద్యాల రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, మహానంది ఎస్‌ఐ జి.పెద్దయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
రథోత్సవంలో ఉద్రిక్తత:
మహానందీశ్వరుడి రథోత్సవంలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. మహానందీశుని రథోత్సవం స్థానిక ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం వద్దకు చేరుకోగానే అక్కడ ఆపాలి అంటూ కొందరు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు అర్చకులు, పండితులపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న మహానంది ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు వెంటనే వారించడంతో సమస్య సద్దుమణిగింది.