వైభవంగా త్రిశూల స్నానం
వైభవంగా త్రిశూల స్నానం
Published Mon, Feb 27 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
- మహానంది క్షేత్రంలో పూర్ణాహుతి
- అంకురార్పణలో మొలకలు వృద్ది
- సమృద్ధిగా వర్షాలకు సూచనగా చెప్పిన పండితులు
మహానంది: మహానంది క్షేత్రంలో వారం రోజుల పాటు వైభవంగా జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం మహాపూర్ణాహుతి పూజలతో ముగిశాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీదేవి సహీత మహానందీశ్వరస్వామి వారికి రుద్రగుండం కోనేరులో వైభవంగా త్రిశూల స్నానం చేయించారు. వేదపండితులు రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండిత బృందం విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. రుద్రగుండం కోనేరులో స్వామివారికి నిర్వహించిన త్రిశూల స్నానంలో భక్తులు పాల్గొని తరించారు. కలశ ఉద్వాసన, ధ్వజ అవరోహణ, మూలమూర్తుల కంకణాల విసర్జన, దీక్షా హోమాలు, మహాపూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
అనంతరం స్థానిక స్వామివారి కల్యాణమండపంలో నాగవేళి పూజలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ 2017 మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అంకురార్పణలో అంకురాలు బాగా మొలిచాయన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయనేందుకు ఇది సూచనగా తెలిపారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీనివాసులు, బాలరాజుయాదవ్, మునెయ్య, రామకృష్ణ, కేశవరావు, శివారెడ్డి, మౌళీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement