లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై బుధవారం నాలుగు మాడ వీధుల్లో విహరించారు.
= భక్తజన సందోహం నడుమ శ్రీవారి గరుడసేవ
= కిక్కిరిసిన గ్యాలరీలు
= మార్మోగిన గోవింద నామస్మరణ
= ఆలయం చుట్టూ భారీ భద్రత
= సీసీ కెమెరాలతో నిఘా
= వీఐపీలు, భక్తుల మధ్య తోపులాట
లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై బుధవారం నాలుగు మాడ వీధుల్లో విహరించా రు. చిన్నపాటి తోపులాటలు మినహా వాహన సేవ ప్రశాంతంగానే ముగిసింది. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పటికీ భక్తులు రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు. వాహన సేవల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నాలుగు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సాక్షి, తిరుమల: లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య తిరుమల శ్రీవేంకటేశ్వరుడు తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై బుధవారం నాలుగు మాడ వీధుల్లో విహరిం చారు. చిన్నపాటి తోపులాటలు మినహా వాహన సేవ ప్రశాంతంగా ముగిసింది.
రాత్రి 7.50 గంటలకే వాహన సేవ
గరుడ వాహన సేవను చూడడానికి ప్రతియేటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈసారి సీమాంధ్రలో బంద్, ఉద్యోగుల సమ్మె ఉన్నప్పటికీ బుధవారం ఉదయం నుంచే భక్తుల రాక కనిపించింది. ఉదయం మోహినీ అవతారం ఊరేగింపులోనే నాలుగు మాడ వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం6 గంటలకు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గ్యాలరీలు నిండిపోయాయి. వాహన సేవను రాత్రి 8 గంటలకే ప్రారంభించాలని టీటీడీ అధికారులు ముందుగా నిర్ణయించారు. 7.40 గంటలకే స్వామివారి ముందున్న తెరను తొలగించి జీయర్ స్వాములు, అర్చకులు, వీఐపీలకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి 7.50 గంటలకు వాహన సేవను ప్రారంభించారు. ఉత్సవమూర్తిని ప్రతి భక్తుడూ దర్శించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.
వీఐపీల హడావిడి
వాహన సేవలో వీఐపీల హడావిడి, తోపులాట ఎక్కువగా కనిపించింది. పాలకమండలి, అధికారవర్గాలు సకుటుంబ సపరివార సమేతంగా తరలిరావడంతో వాహన సేవకు ముందు వీరే అధికంగా కనిపించారు.
భక్తుల మధ్య తోపులాట
శ్రీవారి గరుడ వాహన సేవలో భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. గ్యాలరీలో ఉంటూ ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తిరిగి వెళ్లేందుకు దారి తెలియక తికమకపడ్డారు. వీరికి సరైన మార్గం చూపించడంలో పోలీసులు విఫలమయ్యారు. మాడ వీధుల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. పలువురు గాయపడ్డారు.
భద్రత కట్టుదిట్టం
టీటీడీ సీవీఎస్‌వో జీవీజీ.అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, ఏఎస్పీ ఉమామహేశ్వర్ శర్మ స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి 4 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరిం చారు. జనం కదలికలపై సీసీ కెమెరాలతో నిఘా వేశారు. మెటల్ డిటెక్టర్లు, వ్యక్తిగత తనిఖీ అనంతరమే భక్తులను మాడ వీధుల్లోకి అనుమతించారు. ముందు జాగ్రత్త చర్యగా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్విక్ రియాక్షన్ టీంలను రంగంలోకి దించారు. వందలాది మంది పోలీ సులు మఫ్టీలో నిఘా వేశారు. ఆక్టోపస్ కమాండో సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరించింది.
భక్తులకు ప్రయాణ కష్టాలు
సీమాంధ్ర బంద్ ప్రభావం వల్ల తిరుమలకు కేవలం 99 ఆర్టీసీ సర్వీసులు మాత్రమే నడిపారు. వాటికోసం ప్రయత్నించిన భక్తులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాక్సీలు, జీపులపై ఆధారపడాల్సి వచ్చింది. తిరుపతి నుంచి తిరుమలకు రూ.150 నుంచి రూ.200 వరకు టికెట్టు వసూలు చేశారు. మిగిలిన వారు సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకున్నారు. వాహనాల రద్దీ పెరగడంతో తిరుపతిలోని అలిపిరి వద్ద నామమాత్రంగా తనిఖీలు జరిగాయి.
గరుడ సేవ వైభవంగా సాగింది: ఈవో, జేఈవో
శ్రీవారి గరుడ వాహనసేవ అశేష జనం మధ్య వైభవంగా సాగిందని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ప్రకటించారు. ఏ చిన్న సమస్యా లేకుండా ప్రతి భక్తుడూ వాహనాన్ని దర్శించుకునే భాగ్యం కల్పించామని వెల్లడించారు. భక్తులకు మంచినీరు, అన్నప్రసాదాలు అంద జేసినట్లు చెప్పారు.